రుద్రూర్ : యాసంగి సీజన్‌లో తక్కువ నీటి వసతితో సాగు చేసుకునే శనగ పంటతో రైతులు మంచి దిగుబడులు, ఆదాయం పొందవచ్చని కోటగిరి మండల వ్యవసాయాధి కారి రాజు సూచించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వరి సాగుకు బదులుగా శనగ వంటి ఆరుతడి పంటలను ఎంచుకోవడం ద్వారా నీటిని ఆదా చేయవచ్చని పేర్కొన్నారు. శనగ సాగులో రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను ఆయన వివరించారు.
● నీరు నిల్వ ఉండని నల్లరేగడి, బంకమట్టి నేలలు శనగ సాగుకు అనుకూలం.
● నవంబర్ నెల మధ్య వరకు విత్తుకోవాలి.
● దేశీ రకాలకు ఎకరాకు 25 నుంచి 30 కిలోలు, కాబూలీ రకాలకు 35 నుంచి 40 కిలోల విత్తనం అవసరం.
● వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం పాటించాలి.
● విత్తనాలను శిలీంధ్ర నాశినులతో శుద్ధి చేసి, రైజోబియం, ఫాస్ఫరస్ కరిగించే జీవ ఎరువులు వినియోగించాలి.
● నేల పరీక్ష ఆధారంగా ఎరువులు వాడాలి. అధిక మోతాదులో నత్రజని ఎరువులు వినియోగించొద్దు.
● పంటకు ఎక్కువ నీరు అవసరం లేదని, పూత, కాయ ఏర్పడే దశల్లో నేలలో తేమ ఉండేలా తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి.
● విత్తిన 20 నుంచి 25 రోజుల్లో కలుపు నివారణ చేపట్టాలి.
● శనగ పంటకు ఆశించే పచ్చపురుగు నివారణకు ఎకరాకు నాలుగు నుంచి ఐదు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయాలి.
● పక్షులు వాలేందుకు స్థావరాలు ఏర్పాటు చేయాలి. పురుగు ఉధృతిని గమనిస్తూ అధికారుల సూచనల మేరకు మందులు పిచికారీ చేయాలి.
● వేరు కుళ్లు, ఆకుమచ్చ తెగుళ్ల నివారణకు విత్తన శుద్ధి, పంట మార్పిడి, నీటి నిల్వ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
● మొక్కలు పూర్తిగా ఎండిపోయి ఆకులు పసుపు రంగులోకి మారిన తర్వాత పంట కోత చేపట్టాలి.
● అనుకూల పరిస్థితుల్లో ఎకరానికి 5 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి పొందవచ్చు.


