విద్యార్థుల సామర్థ్యాల పెంపే లక్ష్యంగా.. | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సామర్థ్యాల పెంపే లక్ష్యంగా..

Nov 4 2026 2:08 AM | Updated on Nov 4 2026 2:08 AM

టీచర్లు కృషి చేయాలి..

ఖలీల్‌వాడి: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువుల పరంగా వెనుకబడే ఉంటున్నారు. పాఠశాల విద్యాశాఖ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్న ఆశించినస్థాయిలో ఫలితాలు రావడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సర్వేల్లో అభ్యసన సామర్థ్యాల పరంగా జిల్లా మధ్యమ స్థానం సాధించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, చదువురాని విద్యార్థులపై సర్కారు ప్రత్యేక దృష్టిసారిస్తోంది. ఇందుకోసం ‘సంకల్ప్‌–10 డేస్‌ ఫర్‌ ఎఫ్‌ఎల్‌ఎన్‌’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఈనెల 4 నుంచి 17వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనుండగా విద్యా శాఖాధికారులు పకడ్బందీగా అమలుచేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

అధికారుల పర్యవేక్షణలో..

ప్రభుత్వ పాఠశాలల్లో ఆరోగ్య పాఠశాల కార్యక్రమం, విద్యా ప్రశస్త్‌ వంటి కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టగా తాజాగా ’సంకల్ప్‌–10 డేస్‌ ఫర్‌ ఎఫ్‌ఎల్‌ఎన్‌’ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించి, వారి స్థాయిని గుర్తిస్తారు. అక్షరాలు, అంకెలను గుర్తించని, గుణింతాలు రాని వారిని, ఇంగ్లిష్‌ పదాలు చదవరాని వారిని నాన్‌ అచీవ్‌ మెంట్‌గా పరిగణిస్తారు. చదవడం, రాయడం వచ్చినవారికి అచీవ్‌మెంట్‌ గుర్తిస్తారు. పది రోజుల పాటు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారిని సంసిద్ధులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఎంఈవోలు, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు, సెక్టోరియల్‌ అధికారులతోపాటు డీఈవో పర్యవేక్షిస్తారు. పది రోజుల తర్వాత తిరిగి వారి సామర్థ్యాలు పరీక్షించనున్నారు. అప్పటికీ అచీవ్‌మెంట్‌ సాధించని విద్యార్థులకు మరోసారి విద్యా సామర్థ్యాలు మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టనున్నారు.

గైర్హాజరు కాకుండా చర్యలు..

ప్రభుత్వ స్కూళ్లల్లో టీచర్లు, విద్యార్థుల హాజరుశాతం పెంచడంతోపాటు వారు క్రమం తప్పకుండా బడికి వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నవంబర్‌ మాసాన్ని ప్రత్యేక హాజరు మాసంగా గుర్తించింది. ఈనెలలో విద్యార్థులు గైర్హాజరు లేకుండా, వంద శాతం బడికి వచ్చేలా చర్యలు చేపట్టాలని డీఈవోను ఆదేశించారు. ప్రభుత్వ యాజమాన్య, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లోనూ హాజరును పరిగణలోకి తీసుకోనున్నారు. 8 ప్రత్యేక అంశాలను నిర్దేశించారు. రోజువారి హాజరు నమోదు, విద్యార్థుల అటెండెన్స్‌ మెరుగుపర్చడం, రోజులుగా బడికి రాని విద్యార్థుల ఇంటికి వెళ్లి వచ్చేలా చూడటం, పెండింగ్‌ ఎంట్రీలు, సాంకేతిక సమస్యలను పరిష్కరించడం, హాజరును విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించడం, సమీక్షించడం, తల్లిదండ్రులు, సమాజ భాగస్వామ్యం చేయడం, జిల్లా స్థాయిలో పనితీరు ఎలా ఉందో నవంబర్‌ 30న క్రోడీకరించుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. నెలరోజుల పాటు బడుల్లో టీచర్లు, విద్యార్థుల హాజరు వందశాతం నమోదైతే, ఆయా స్కూల్‌ హెచ్‌ఎంలకు రాష్ట్రస్థాయిలో సన్మాన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రస్తుతం జిల్లాలో విద్యార్థుల హాజరు 78 శాతం ఉండగా, ఉపాధ్యాయుల హాజరు 86 శాతం వరకు ఉంది. విద్యార్థుల హాజరు పెరిగితేనే వారిలో విద్యాసామర్థ్యాలు పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపర్చేందుకు సంకల్ప్‌–10డేస్‌ ఫర్‌ ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమం చేపడుతున్నాం. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం, అక్షరాలు గుర్తించడం రావాలి. విద్యార్థుల సామర్థ్యాలు పెంచేందుకు టీచర్లు కృషి చేయాలి.

–శ్రీధర్‌ రెడ్డి, సెక్టోరియల్‌ ఆఫీసర్‌,

నిజామాబాద్‌

నేటి నుంచి ‘సంకల్ప్‌–10 డేస్‌ ఫర్‌

ఎఫ్‌ఎల్‌ఎన్‌’కు ప్రభుత్వం శ్రీకారం

ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు, టీచర్ల అటెండెన్స్‌పై దృష్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement