ధాన్యం ధర తెగ్గోత | - | Sakshi
Sakshi News home page

ధాన్యం ధర తెగ్గోత

Nov 2 2026 1:17 AM | Updated on Nov 2 2026 1:17 AM

సుభాష్‌నగర్‌: జిల్లాలో ధాన్యం ధరను దళారులు తెగ్గోస్తున్నారు. సీజన్‌ ప్రారంభంలో రూ.4 వేలు (పచ్చివి) ధర పలుకగా, ఇప్పుడు రూ.2600కు కూడా అడిగే నాథుడు లేకుండా పోయాడు! ఎండబెట్టిన ధాన్యం ధర రూ.3 వేల దిగువకు పడిపోయింది. దీంతో అన్నదాతలు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్రాలను ప్రారంభించినా ఇప్పటి వరకు ఒక్క గింజనూ పౌరసరఫరాల శాఖ సేకరించలేదు. మరోవైపు తుపాన్‌ ప్రభావంతో అక్కడక్కడ వర్షసూచన ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో ఈసీజన్‌లో 4.35 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ప్రభుత్వం బోనస్‌ ప్రకటించిన ఏడు రకాలు 4,18,551 ఎకరాల్లో, మిగతా 16,449 ఎకరాల్లో ఇతర రకాలు సాగుచేశారు. ప్రజల వినియోగం, మిల్లర్లు, ట్రేడర్లు కొనుగోళ్లు మినహాయిస్తే మిగతా 6.50 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సేకరించిన ధాన్యం రవాణా కోసం జిల్లాను 10 సెక్టార్లుగా విభజించారు. సు మారు 600కుపైగా లారీలు అందుబాటులో ఉంచా రు. ధాన్యం సేకరణకు 1.63 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం కాగా, 69 లక్షలకు పైగా సంచులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

ఊపందుకున్న కోతలు

జిల్లావ్యాప్తంగా వరి కోతలు ఊపందుకున్నాయి. ఇప్పటికే వర్ని, రుద్రూర్‌, కోటగిరి, మోస్రా, చందూర్‌, ఎడపల్లి, బోధన్‌ తదితర మండలాల్లో 80 శాతానికిపైగా పంట కోతలు పూర్తయ్యాయి. ఆ ప్రాంతాల్లో పచ్చి ధాన్యం రూ.3 వేలకుపైనే ధర పలికింది. మిగతా మండలాల్లో రూ.2600 నుంచి రూ.2700 వరకు కొనుగోలు చేస్తుండగా, మరికొన్ని ఏరియాల్లో పచ్చి ధాన్యం అడిగే వారు కరువయ్యారు. సిరికొండ, భీమ్‌గల్‌, ధర్పల్లి, డిచ్‌పల్లి, నందిపేట్‌, మాక్లూర్‌, మోపాల్‌, జక్రాన్‌పల్లి, తదితర మండలాల్లో రైతులు ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో 50 శాతానికిపైగా కోతలు పూర్తయ్యాయి. కోసిన ధాన్యం కోసినట్లు ప్రయివేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ సీజన్‌లో జిల్లా నుంచి అత్యఽధికంగా కర్నాటక రాష్ట్రానికి ధాన్యం తరలిపోగా, అలాగే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, మిర్యాలగూడకు కూడా దళారులు తరలించారు.

ఒక్క గింజా సేకరించలేదు..

జిల్లాలో దాదాపు 50 శాతానికిపైగా కోతలు పూర్తయినప్పటికీ.. పౌరసరఫరాలశాఖ రైతుల నుంచి ఒక్క గింజా సేకరించలేదు. 586 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా.. ఎక్కడ కూడా కొనుగోలు చేపట్టలేదు. కోతలు ప్రారంభమై నెల కావస్తున్నా.. హమాలీలు, గన్నీ బ్యాగులు వంటివి లేవు. దీపావళి తర్వాతే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించనున్నట్లు తెలుస్తోంది. సేకరించిన ధాన్యాన్ని స్టేట్‌ వేర్‌హౌజ్‌ కార్పొరేషన్‌ గోదాములకు తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వ కోసం గోదాములను సిద్ధం చేశారు. అలాగే డీఫాల్ట్‌ లేని రైస్‌మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీ ఇస్తే వారికి కూడా అధికారులు అలాట్‌మెంట్‌ చేయనున్నారు.

ఇదేవిషయమై పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ ప్రవీణ్‌కుమార్‌ను వివరణ కోరగా.. ధాన్యం సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులు ఆందోళన చెందొద్దన్నారు.

రూ.3వేల దిగువకు..

ధాన్యం కేంద్రాల వైపు రైతన్న చూపు

జాడ లేని ప్రభుత్వ సెంటర్లు..

పత్తాలేని హమాలీలు, గన్నీ బ్యాగులు

వర్షసూచనతో ఆందోళనలో

అన్నదాతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement