ఛోటి ఛోటి బాతే... మీఠి మీఠి యాదే.. | - | Sakshi
Sakshi News home page

ఛోటి ఛోటి బాతే... మీఠి మీఠి యాదే..

Oct 27 2026 12:50 AM | Updated on Oct 27 2026 12:50 AM

● కామారెడ్డిలో బాల్యమిత్రుల

అరుదైన కలయిక

● 1969–70 బ్యాచ్‌ టెన్త్‌ విద్యార్థుల

సమ్మేళనం

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : అప్పుడెప్పుడో 1969 –70లో పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత పై చదువులు.. ఉద్యోగాలు.. కుటుంబ జీవితం.. కాలం వేగంగా పరుగెత్తింది. దశాబ్దాలు గడచిపోయాయి. వారికిప్పుడు ఏడు పదుల వయసు దాటింది. చిన్ననాటి జ్ఞాపకాలు మదిలో మెదిలాయి. చదువుకున్న రోజులు గుర్తొచ్చాయి. 56 ఏళ్ల తర్వాత తాము చదువుకున్న బడిలో స్నేహితులు మళ్లీ కలిశారు. ఈ అరుదైన భావోద్వేగ సంగమానికి కామారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల వేదికై ంది. పాఠశాలలో 1969–70 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన వారు సోమవారం కలుసుకున్నారు. ఆ బ్యాచ్‌లో 32 మంది విద్యార్థులు చదువుకోగా.. ఆరుగురు కాలం చేశారు. నలుగురు వివిధ కారణాలతో సమ్మేళనానికి హాజరు కాలేదు. 22 మంది సమ్మేళనంలో పాల్గొని ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తమ తమ స్థాయి భేదాలు మరిచి మళ్లీ చిన్నపిల్లలయిపోయారు. పాఠశాలంతా కలియతిరిగారు. తరతరాలుగా విద్యానిలయంగా భాసిల్లిన తమ పాఠశాల భవనం శిథిలమైపోయిన దృశ్యం చూసి కొందరి కళ్లు చెమ్మగిల్లాయి. భవనం తొందర్లోనే నేలమట్టమవుతుందన్న విషయం తెలియడంతో అందరూ బడి దగ్గర ఫొటోలు దిగారు. ఆనాడు ఎవరెవరు ఏ బెంచీల్లో కూర్చున్నారో, ఏయే టీచర్‌ ఎవరెవరిని చెవులు పిండి చేతికి పని చెప్పారో గుర్తు చేసుకున్నారు. తమ తమ జీవితాల్లోని మెరపులను, మరకలను అరమరికలు లేకుండా పంచుకున్నారు. అకాల మరణంతో తమకు దూరమైన సహధ్యాయిలను స్మరించుకున్నారు. అందరూ కలిసి భోజనాలు చేసి తీపి జ్ఞాపకాలను మోసుకుంటూ భారమైన హృదయాలతో నిష్క్రమించారు. సమ్మేళనానికి ఈ బ్యాచ్‌ విద్యార్థి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల అధ్యాపక సంఘం మాజీ అధ్యక్షుడు కే.శ్యాంరావ్‌ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించగా.. పూర్వ విద్యార్థులు సీనియర్‌ రాజకీయ నాయకుడు కొత్తపల్లి మల్లయ్య, ప్రముఖ సర్జన్‌ పీఎల్‌ చారి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ మాజీ చైర్మన్‌ అయాచితం శ్రీధర్‌, రిటైర్డ్‌ పోలీస్‌ ఉన్నతాధికారి బాలమురళి, ప్రముఖ హోమియో వైద్యుడు ఎం.రాజేశ్వర్‌, వ్యాపార ప్రముఖులు చాట్ల మురహరి, చాట్ల ఉపేంద్ర, మోటూరి విఠల్‌, గరిపల్లి ధనుంజయ్‌, విఠల్‌రావ్‌, కై లాస్‌ చంద్రప్రకాశ్‌, మహ్మద్‌ షఫీ, రిటైర్డ్‌ ఉద్యోగులు మధుసూదన్‌, వెంకటేశ్వర్‌రావ్‌, సుప్రియ తదితరులు పాల్గొన్నారు. వీరిలో చాలామంది తొలిదశ తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో పాల్గొన్నవారే కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement