మరిపెడ రూరల్: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ ఆర్‌ఎంపీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపూడి గ్రామానికి చెందిన వడ్డెబోయిన సుమన్ (50) నిజామాబాద్‌లో ఆర్‌ఎంపీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. దసరా పండుగ సందర్భంగా ఇటీవల అతడు స్వగ్రామమైన గుండెపూడికి వచ్చాడు. పండుగ అనంతరం తన ఇద్దరు కుమార్తెలతో కలిసి సొంత కారులో నిజామాబాద్ బయలుదేరాడు. ఈక్రమంలో మరిపెడ శివారు సాయిబాబా గుడి సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమన్ తీవ్రంగా గాయపడగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఆయన కుమార్తెల్లో ఒకరు చికిత్స పొందుతున్నారు.
నవీపేట మండలంలో..
నవీపేట: మండలంలోని కమలాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన దున్నస్వామి(45) ఈనెల 24న పొలంలో గడ్డి మందు చల్లడానికి వెళ్లాడు. ఈక్రమంలో అతడు విషగుళిక రుచిని చూసేందుకు నోట్లో వేసుకోవడంతో అస్వస్థతకు గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో వెంటనే స్థానికులు జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై తెలిపారు. మృతుడికి కూతురు, కుమారుడు ఉన్నారు.
గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో గల వాగు వంతెన పైనుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్యా యత్నం చేశాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. మండల పరిధిలోని గౌరారం గ్రామానికి చెందిన అంజయ్య కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటూ ఓ ప్రైవేటు స్కూలు బస్సు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. దసరా పండుగ నేపథ్యంలో ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. ఈక్రమంలో అతడు కుటుంబ సభ్యులతో గొడవ పడినట్లు సమాచారం. దీంతో అతడు జీవితంపై విరక్తి చెంది ఆదివారం మండల కేంద్రంలోని వాగు వంతెన పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. వాగు వద్ద ఉన్న మేకలకాపరులు గమనించి కాపాడినట్లు తెలిపారు.


