● కేసును ఛేదించిన పోలీసులు
● ఆరుగురు అరెస్ట్
● అమ్మ ఒడికి చేరిన చిన్నారి ధనుష్
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలో కలకలం రేపిన నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. బాలుడిని క్షేమంగా రక్షించి తల్లికి అప్పగించడంతోపాటు కిడ్నాప్‌కు పాల్పడిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ నరహరి శనివారం వెల్లడించారు. జిల్లా కేంద్రంలో చెత్త ఏరుకుంటూ జీవనం సాగించే ఆదిత్య, నవనీత దంపతుల మధ్య గొడవలు జరగడంతో తల్లి చిన్న కుమారుడితో కలిసి సొంతూరు అడ్లూరు ఎల్లారెడ్డికి వెళ్లిపోయింది. తండ్రి ఆదిత్య నాలుగేళ్ల పెద్ద కుమారుడు ధనుష్‌తో కలిసి గాంధీగంజ్‌లోని రైతుబజార్ షెడ్‌లలో ఉంటున్నాడు. ఈ నెల 17న సాయంత్రం బాలుడు కనిపించకుండా పోవడంతో తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టాయి. ఉప్పల్‌వాయి, రామేశ్వర్‌పల్లి గ్రామాలకు చెందిన చాకలి లక్ష్మి, పెద్దోళ్ల నర్సవ్వ, మణెవ్వ, మీనా, నవీన్, పర్వయ్య కలిసి నిద్రిస్తున్న బాలుడికి చిప్స్ ఆశచూపి మాయమాటలతో అపహరించినట్లు గుర్తించారు. చిన్నారిని విక్రయించి సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతోనే కిడ్నాప్‌కు పాల్పడినట్లు తేలింది. సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా నిందితులను పట్టుకొని బాలుడిని తల్లి నవనీతకు క్షేమంగా అప్పగించారు. నేరాల నియంత్రణ కోసం గ్రామాలు, కాలనీల్లో స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని సీఐ నరహరి కోరారు.


