పరిస్థితులను ముందుగా అంచనా వేయాలి | - | Sakshi
Sakshi News home page

పరిస్థితులను ముందుగా అంచనా వేయాలి

Oct 23 2026 1:21 AM | Updated on Oct 23 2026 1:21 AM

ఎల్‌నినో నేపథ్యంలో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలి

నిజామాబాద్‌ అర్బన్‌: ఎల్‌నినో ప్రభావం తీవ్రరూ పం దాలుస్తున్న దృష్ట్యా, రానున్న పరిస్థితులను ముందుగానే అంచనా వేసి తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సూచించారు. జలాశయాల్లో అందుబాటు లో ఉన్న నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాగు నీటి సరఫరాకు అవకాశం లేనందున యాసంగిలో వరి సాగు చేయకుండా రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఎల్‌నినో నేపథ్యంలో ఛేపట్టాల్సిన చర్యలపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్‌ గురువారం సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. తాగునీరు, విద్యుత్‌ అవసరాలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలన్నారు. సంప్రదాయంగా వస్తున్న వరి పంటకు బదులుగా నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తూ రానున్న రోజుల్లో ఎదురయ్యే విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా అధిగమించాలని అన్నారు. గ్రామస్థాయిలో రైతులతో సమావేశాలు నిర్వహించి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూగర్భ జలాల పరిస్థితిని వివరించాలని ఆదేశించారు.

రానున్న ఎనిమిది నుంచి పది నెలలకు సంబంధించి గ్రామాల వారీగా సమగ్ర ప్రణాళికలు రూపొందించి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా ప్రజలకు తాగునీటి కొరత తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, అవసరమైన చోట యుద్ధప్రాతిపదికన మంచినీటి పైప్‌ లైన్ల మరమ్మతులు, నూతన నిర్మాణాలు, వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకోవడం వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎక్కడైనా సమస్యలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరిస్తూ, నీటి సరఫరా వ్యవస్థలు సక్రమంగా పని చేసేలా అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాల న్నారు. సమీక్షాసమావేశంలో అదనపు కలెక్టర్‌లు రాజాగౌడ్‌, భుజంగరావు, ఆర్డీవోలు రాజేంద్రకుమార్‌, విజయకుమారి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

యాసంగిలో వరి సాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలి

అధికారులతో సమీక్షలో కలెక్టర్‌

ఇలా త్రిపాఠి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement