● క్వింటాల్ పసుపునకు రూ.25,109
● మెరిసిన పచ్చ బంగారం
● స్టాకిస్ట్‌లకు పండుగ..
● నోరెళ్లబెట్టిన రైతన్న
ఆర్మూర్ : పసుపు దిగుబడులను దాదాపు రైతులంతా అమ్మేసిన తరువాత ధర అనూహ్యంగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్, వర్షాభావ పరిస్థితులతో అన్ని పంటల మాదిరిగానే పసుపు ధర కూడా పెరుగుతోంది. సీజన్‌లోనే 80 శాతం మంది రైతుల నుంచి మధ్య దళారులు పసుపును కొనుగోలు చేశారు. ఇప్పుడు ధర పెరగడంతో వారే లాభపడుతుండగా.. పంట దిగుబడిని అమ్ముకున్న రైతులు మాత్రం నోరెళ్లబెడుతున్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం పసుపునకు భారీ ధర లభించింది. క్వింటాలకు రూ.25,109 ధర లభించడం గమనార్హం.
దళారీ చేతికి లాభం..
జనవరి, ఫిబ్రవరిలో పంట చేతికి వచ్చినప్పుడు రైతులు అప్పుల ఒత్తిడితో క్వింటాను రూ.10 వేల నుంచి రూ.12 వేలకు విక్రయించారు. అదే పసుపును దళారులు, స్టాకిస్టులు కొని నిల్వ చేసి ప్రస్తు తం రూ.25,109కు అమ్ముతున్నారు. రోజుకు 2వేల బస్తాల వరకు పసుపు వస్తుండగా అంతా దళారులు తీసుకువస్తున్నదే అని తెలుస్తోంది.
నిల్వ చేసుకోలేక నష్టం
రైతులు నష్టపోవడానికి ప్రధాన కారణం నిల్వ సౌ కర్యం లేకపోవడంతోపాటు నిలువ చేసుకొనే విధానంపై వారికి అవగాహన లేకపోవడమే. జిల్లా మా ర్కెట్ యార్డులో కోల్డ్ స్టోరేజీ సౌకర్యం లేదు. జి ల్లాలోని పలు చోట్ల ప్రయివేట్ కోల్డ్ స్టోరీజీలు అందుబాటులో ఉన్నప్పటికీ రైతులు పంట దిగుబడిని నిలువ చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. ఆర్థిక కారణాలతో చేతికి అందిన వెంటనే పంట దిగుబడిని విక్రయిస్తున్నారు. మరి కొందరు రైతులు తేమ, శిలీంధ్రం కారణంగా పసుపు పాడవుతుందని భయపడి ఉన్నదంతా ఒకేసారి అమ్మేస్తున్నారు.


