● త్వరలోనే డీపీఆర్ సిద్ధం
● నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే
ధన్‌పాల్ సూర్యనారాయణ
సుభాష్‌నగర్: ఇందూరులో ఎంతో ఘన చరిత్ర కలిగిన ఖిల్లా రామాలయానికి రోప్‌వే మంజూరైనట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ గురువు సమర్థ రామదాసు నిర్మించిన చారిత్రాత్మక కట్టడం ఖిల్లా రామాలయం అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో దాశరథి కృష్ణమాచార్యులు జైలు శిక్ష అనుభవిస్తూ ‘తెలంగాణ నా కోటి రతనాల వీణ’ అని గోడలపై రాసిన గొప్ప చరిత్ర కలిగిందన్నారు. ఆలయాన్ని పర్యాటక స్థలంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. సుమారు రూ.35 కోట్లతో రోప్‌వే నిర్మాణం చేపట్టనున్నారని, ఇందుకు డీపీఆర్ సిద్ధం చేస్తున్నారని తెలిపారు. మోదీ ప్రభుత్వం చారిత్రక కట్టడాలపై ప్రత్యేక దృష్టి వహిస్తుందన్నారు. ఇందులోభాగంగానే పర్వతమాల పథకానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతోపాటు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఖిల్లా రామాలయ అభివృద్ధిపై ఎంపీ అర్వింద్ ధర్మపురితో కలిసి పలుమార్లు విన్నవించినట్లు తెలిపారు. స్పందించిన ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్ అండ్ బీ అధికారులు, రోప్ వే కంపెనీ ప్రతినిధులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. అర్బన్‌లోని సౌత్ మండల అర్హులకు ఇళ్లను కేటాయించారని గుర్తుచేశారు. అలాగే స్థలం లేని వారికి హైదరాబాద్ మాదిరిగా టవర్లు నిర్మించి ఇవ్వాలని చెప్పినట్లు తెలిపారు. స్పెషల్ ఫండ్ కోసం ప్రభుత్వానికి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డికి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇందూరులో కాషాయ జెండా గెలుపును ఓర్వలేకనే నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు ఎర్రం సుధీర్, జగదీష్ కులకర్ణి, మఠం పవన్, రాము, మహిళా మోర్చ అధ్యక్షులు వనిత, తదితరులు పాల్గొన్నారు.


