● కోటగిరి, రుద్రూర్లో పోలీసుల తనిఖీలు
● అధిక వడ్డీల వసూళ్లపై ఆరా
రుద్రూర్: వడ్డీ వ్యాపారుల కార్యకలాపాలపై పోలీసులు నిఘా పెంచారు. ఇందులో భాగంగా కోటగిరి, రుద్రూర్ ప్రాంతాల్లో పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వడ్డీ వ్యాపారుల లావాదేవీలు, వడ్డీ వసూళ్ల తీరుపై ఆరా తీస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక వడ్డీలు వసూలు చేస్తూ, అప్పు తీసుకున్న వారిని ఇ బ్బందులకు గురిచేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.
అత్యవసర, ఆర్థిక అవసరాల కోసం అప్పులు తీసుకునే సామాన్యులు కొందరు వడ్డీ వ్యాపారుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తీసుకున్న అప్పునకు అధిక వడ్డీలు వసూలు చేయడం, గడువు లోగా డబ్బులు చెల్లించకపోతే ఒత్తిడి తీసుకురావడం వంటి అంశాలపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు. వడ్డీ వ్యాపారాలు నిర్వహించేవారు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని, అక్రమ వసూళ్లకు పాల్పడవద్దని సూచిస్తున్నారు.
ఫిర్యాదులపై చర్యలు
వడ్డీ వ్యాపారుల వేధింపులకు గురయ్యే బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టి, చట్ట విరుద్ధ కార్యకలాపాలు గుర్తిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కోటగిరి, రుద్రూర్, ఇతర ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీలతో వడ్డీ వ్యాపారుల వ్యవహారాలపై స్థానికంగా చర్చ జరుగుతోంది.


