డొంకేశ్వర్: మండలంలోని అన్నారం సర్పంచ్ అట్టోలి సంజీవ్ రాష్ట్ర ఎస్సీ మోర్చా స్పోక్ పర్సన్‌గా నియామకం అయ్యారు. ఈ మేరకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి చేతుల మీదుగా నియామకపత్రం అందుకున్నారు. బీజేపీలో కొనసాగుతున్న సంజీవ్ గతంలో పలు కీలక పదవుల్లో పని చేశారు. ఇప్పుడు ఎస్సీ మోర్చాలో రాష్ట్ర పోస్టు ఇవ్వడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తనను నమ్మి పదవి అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి, ఎంపీ అర్వింద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
పెర్కిట్: ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ మహబూబ్ మత సామరస్యానికి ప్రతీకగా నిలిచాడు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రామంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి తనవంతుసాయంగా రూ.50 వేలను విరాళంగా అందజేశారు. మహబూబ్ విరాళం అందజేయడంపై ఉత్సవ నిర్వాహకులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
డొంకేశ్వర్(ఆర్మూర్): మండలంలోని కోమట్‌పల్లి గ్రామంలో దుర్గామాతకు కరెన్సీతో అలంకరణ చేశారు. 17వ వార్షికోత్సవం సందర్భంగా రూ.17,17,017 నగదును వినియోగించినట్లు ఉత్సవ కమిటీ వెల్లడించింది. చండీయాగం కూడా నిర్వహించారు.
నవీపేట: మండలంలోని జన్నేపల్లి గ్రామంలో ఉన్న మైనంపల్లి హనుమంతరావు గెస్ట్ హౌస్ లో ఆదివారం రాత్రి నిర్వహించిన తెప్పోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మైనంపల్లి హనుమంతరావు ప్రతియేట గెస్ట్ హౌస్ లో దేవి నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి నీటి కొలనులో అమ్మవారి విగ్రహాన్ని ఊరేగిస్తూ తెప్పోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


