కామారెడ్డి టౌన్ : శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆధ్యాత్మిక శోభతో పాటు పండుగ సంబురం అంబరాన్నంటింది. పట్టణంలోని పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాల వద్ద దాండియా, గర్భా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రంగురంగుల సంప్రదాయ దుస్తులు ధరించి మహిళలు, యువతులు, చిన్నారులు లయబద్ధంగా దాండియా కోలాటాలు ఆడుతూ సందడి చేస్తున్నారు.
భక్తిగీతాలు, డీజే పాటల హోరులో చిన్నారుల నుంచి పెద్దల వరకు ఉత్సాహంగా అడుగులు వేస్తూ నృత్యాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని హిందుసేనా, శాస్త్రి ఆదర్శసంఘం, గణసేనా తదితర మండపాల వద్ద రాత్రి దాండియాతో రద్దీ నెలకొంది. యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటూ దాండియా ఆడుతున్నారు.


