● డీఆర్డీవో సాయన్న
వర్ని: వీబీజీ రామ్‌జీ పనులలో అవినీతికి పాల్పడితే రికవరీతో పాటు జైలుకు వెళ్లాల్సి వస్తుందని డీఆర్డీవో సాయన్న హెచ్చరించారు. గురువారం మోస్రా మండల కేంద్రంలో వీబీజీ రామ్‌జీ పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు. ఎల్‌నినో వల్ల ఏర్పడిన కరువు పరిస్థితులను అధిగమించటానికి కూలీలకు పనులు కల్పించాలని, పనుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సూచించారు. గ్రామాల్లో పనుల వివరాలను సోషల్ ఆడిట్ టీం అధికారులకు వివరించారు. ఎంపీడీవో సాయికుమార్,ఏపీవోలు,జీపీ కార్యదర్శులు పాల్గొన్నారు.
వేల్పూర్: రామన్నపేట్లో ముగ్గురు లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ప్రజాప్రతినిధులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు గురువారం అందజేశారు. సర్పంచ్ బేల్దారి నవీన్, గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, నాయకులు శోభన్‌రెడ్డి, రుణాల చిన్నయ్య, భూమేశ్వర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నితిన్, మహిపాల్‌రెడ్డి, గుమ్ముల భూమేశ్వర్, గుమ్ముల మహేందర్, గిరీష్ పాల్గొన్నారు.
రెంజల్: కళ్యాపూర్‌లో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు గురువారం స్థానిక సర్పంచ్ రెమ్మ భానుచందర్ భూమిపూజ నిర్వహించారు. వీబీ జీ రాంజీ పథకం నుంచి రూ. 20 లక్షలు మంజూరైనట్లు సర్పంచ్ పేర్కొన్నారు. ఉప సర్పంచ్ శ్రీకాంత్, గ్రామ పెద్దలు కాశం సాయిలు, జల్లయ్య, ఒడ్డెక్క మోహన్, సాయినాథ్, లింగం, కిన్నెర మోహన్, గంగాధర్, వార్డు సభ్యులు పాల్గోన్నారు.
కమ్మర్పల్లి(మోర్తాడ్): ఏర్గట్ల మండలం తడపాకల్, గుమ్మిర్యాల్, దోంచంద గ్రామాల పరిధిలోని గోదావరి నది వద్ద అదనంగా పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క)కు ఏర్గట్ల మండలంలోని కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్‌లు విన్నవించారు. గురువారం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శివనోళ్ల శివకుమార్, తొర్తి, గుమ్మిర్యాల్, తడపాకల్ సర్పంచ్‌లు కౌడ భూమేశ్వర్, సంజీవ్‌యాదవ్, జింక అనిల్ యాదవ్‌లు హైదరాబాద్ సెక్రటేరియట్లో మంత్రి సీతక్కను కలిశారు. ఈమేరకు వినతి పత్రం అందజేశారు.


