పైరవీల ‘పంచాయితీ’! | - | Sakshi
Sakshi News home page

పైరవీల ‘పంచాయితీ’!

Oct 19 2026 2:07 AM | Updated on Oct 19 2026 2:07 AM

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): జిల్లాలో కొంతమంది గ్రామ పంచాయతీ కార్యదర్శుల వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కొద్ది నెలల క్రితమే జిల్లాలో పారదర్శకంగా సాధారణ బదిలీలు జరిగినప్పటికీ, తమకు అనుకూలమైన గ్రామ పంచాయతీలు, ముఖ్యంగా ‘ఆదాయం’ ఎక్కువగా ఉన్న పెద్ద పెద్ద జీపీల్లో పోస్టింగ్‌ల కోసం కొందరు కార్యదర్శులు ఆరాటపడుతున్నారు. ‘డిప్యుటేషన్ల’ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జిల్లాలో 16మంది డిప్యుటేషన్ల వ్యవహారం ‘పంచాయితీకి’ దారితీస్తోంది.

పొలిటికల్‌ లీడర్లతో పైరవీలు..

తమకు నచ్చిన చోటికి డిప్యుటేషన్‌ లేదా బదిలీ చేయించుకునేందుకు కొందరు కార్యదర్శులు రాజకీయ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ వారి నుంచి సిఫారసు లేఖలు సంపాదిస్తున్నారు. ఆ లేఖలతో జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) కార్యాలయంలో అప్లై చేసుకుంటూ, ఉన్నతాధికారులపై పొలిటికల్‌ లీడర్లతో ఫోన్‌లు చేయిస్తూ తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం అధికారులకు కూడా కనీస గౌరవం ఇవ్వకుండా కొందరు వ్యవహరిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

ఈ పైరవీల పర్వంలో కొందరు కార్యదర్శులు మరీ బరితెగించి వ్యవహరిస్తున్నారు. తోటి పంచాయతీ కార్యదర్శికి కనీస సమాచారం కూడా లేకుండా, అంతర్గతంగా డిప్యుటేషన్‌ ఆర్డర్లు సాధిస్తున్నారు. దీంతో అప్పటికే ఆయా గ్రామాల్లో నిబంధనల ప్రకారం పని చేస్తున్న కార్యదర్శులను అకస్మాత్తుగా అక్కడి నుంచి కదిలిస్తున్నారు. ‘మేము సాధారణ బదిలీల్లో భాగంగానే రూల్స్‌ ప్రకారం ఇక్కడికి వచ్చాం.. మాకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, కేవలం రాజకీయ పైరవీలతో తమను ఇక్కడి నుంచి ఎలా కదిలిస్తారు?‘ అంటూ బాధితులైన కార్యదర్శులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మండల బాసులకే తెలియదు..

మండల స్థాయిలో పంచాయతీ పరిపాలనను పర్యవేక్షించాల్సిన మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులకు (ఎంపీడీవో) సైతం కనీస సమాచారం ఇవ్వకుండా బదిలీల బాగోతం నడుస్తోంది. తమ పరిధిలోని కార్యదర్శులు రాజకీయ నేతలతో నేరుగా పైరవీలు చేసుకుని బదిలీలు చేయించుకుంటుండడంతో ఎంపీడీవోలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది కారణంగా వ్యవస్థ మొత్తం గాడి తప్పుతోందని, సాటి ఉద్యోగులకే అన్యాయం జరుగుతోందని యూనియన్‌ నేతలు మండిపడుతున్నారు. సంఘం క్రమశిక్షణను, పెద్దల మాటను సైతం కొందరు కార్యదర్శులు లెక్కచేయకపోవడంపై యూనియన్‌ అంతర్గత సమావేశాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

కొందరు పంచాయతీ కార్యదర్శుల

తీరుపై సర్వత్రా చర్చ

ఆదాయం ఉన్న జీపీలపైనే వారి కన్ను..

పొలిటికల్‌ సిఫారసులతో డిప్యుటేషన్ల వేట

సాధారణ బదిలీలు జరిగినా అగని ఆరాటం

తోటి ఉద్యోగుల సీటుకే ఎసరు పెడుతున్న వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement