● సీపీ సాయి చైతన్య
బోధన్: ఎన్‌సీసీ శిక్షణతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవడుతాయని సీపీ సాయి చైతన్య అన్నారు. ఎడపల్లి మండలంలోని జానకంపేట శివారులోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో 12వ బెటాలియన్ ఎన్‌సీసీ నిజామాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కెడెట్ల వార్షిక శిక్షణ శిబిరం ఈ నెల 9 నుంచి 18 వరకు కొనసాగనుంది. బుధవారం శిక్షణ శిబిరాన్ని సీపీ సందర్శించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, యువత సరైన విలువలతో ఎదిగినప్పుడే సమాజం, దేశాభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయని అన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో బెటాలియన్ ఎన్‌సీసీ కమాండెంట్ అధికారి విష్ణు పీ నాయర్, సుబేదార్ మేజర్ రచ్‌పాల్ సింగ్, సీటీసీ ఏసీపీ రాజశేఖర్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్‌బాబు, సీటీసీ ఎస్సై వరప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వృద్ధులను గౌరవించాలి
వర్ని: వయసు పైబడిన తల్లిదండ్రులు, వృద్ధులపై ప్రతి ఒక్కరూ గౌరవం ప్రేమ ఆప్యాయతతో వ్యవహరించాలని సీపీ సాయి చైతన్య సూచించారు. బుధవారం మోస్రా మండలం చింతకుంట వృద్ధాశ్రమాన్ని ఆయన సందర్శించారు. ఆశ్రమంలో నివసిస్తున్న వృద్ధులు ఒంటరితనానికి గురికాకుండా ఆత్మవిశ్వాసం భరోసా కల్పించేలా ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయబాబు, రుద్రూర్ సీఐ కృష్ణ, బోధన్ ఎస్‌హెచ్‌వో వెంకట్ నారాయణ, వర్ని ఎస్సై వంశీకృష్ణ, ఆశ్రమ నిర్వాహకులు మోహన్ పాల్గొన్నారు.


