బిచ్కుంద: మండల శివారులోని కమ్మరి చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై రాజు తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన నిఖిల్(32) కూలీ పనులు చేస్తు కుటుంబాన్ని పోషించేవాడు. గత మూడేళ్ల నుంచి మతిస్థిమితం కోల్పోడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతను తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. బుధవారం చెరువులో మృతదేహం ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
నవీపేట: కుటుంబల కలహాలతో ఒకరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న నవీపేట మండలం ధర్మారం రైల్వే గేట్ సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ మహబూబ్ తెలిపిన వివరాల ప్రకారం.. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కొమురి మల్లేశ్ (39) ధర్మారం గ్రామంలోని బంధువుల ఇంటికి రెండు రోజుల క్రితం వచ్చాడు. కొన్ని రోజులుగా ఇంట్లో కుటుంబ కలహాలు జరగడంతో మనోవేదనకు గురైన అతను రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఒకరిపై అట్రాసిటీ కేసు నమోదు
వేల్పూర్(ముప్కాల్): ముప్కాల్ మండల కేంద్రంలో ఇటీవల గద్దల గంగారాంను కులం పేరుతో దూషించిన ముప్కాల్‌కు చెందిన ముస్కు భూమేశ్వర్‌పై బుధవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్‌పాల్ తెలిపారు. తన ప్లాటులో అక్రమంగా హద్దురాల్లు ఎందుకు పాతుతున్నావని ప్రశ్నించినందుకు భూమేశ్వర్ కులం పేరుతో దూషించినట్లు గంగారాం ఫిర్యాదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.
రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
గాంధారి: గాంధారి అటవీ రేంజ్ పరిధిలోని సీతాయిపల్లి బీట్ 807 కంపార్ట్‌మెంట్‌లో నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను బుధవారం సీజ్ చేసినట్లు ఎఫ్‌ఆర్‌వో రమేశ్ తెలిపారు. ఎల్లారెడ్డి మండలం వెల్లుట్లపేట గ్రామానికి చెందిన కర్రెచెవుల రాజులు, పటేల్ బాల్‌రాజు ఎలాంటి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తుండడంతో దాడి చేసి ట్రాక్టర్లను సీజ్ చేశారు. వీటిని అటవీ రేంజ్ కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌ఆర్‌వో పేర్కొన్నారు.


