లక్డీకాపూల్: కామారెడ్డికి చెందిన ఓ వ్యాపారవేత్త బ్రెయిన్‌డెడ్ కాగా, అవయవ దానంతో నలుగురు రోగులకు పునర్జన్మ లభించింది. వివరాలు ఇలా.. కామారెడ్డిలోని రాజానగర్ నివాసి పవన్ కుమార్ జాజు (39) వృత్తిరీత్యా వ్యాపారవేత్త. కొన్ని రోజులుగా తలనొప్పితో బాధపడుతున్న ఆయనకు అకస్మాత్తుగా బ్రెయిన్ హెమరేజ్ (మెదడులో రక్తస్రావం) కావడంతో ఈనెల 7న కామారెడ్డిలోని ఒక ప్రయివేట్ ఆస్పత్రి చేర్పించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఒక ప్రయివేట్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. ఇంతటి విషాద సమయంలో పవన్ కుమార్ కుటుంబ సభ్యులు ఆయన అవయవాలను దానం చేయడానికి అంగీకరించారు. దీంతో అతడి రెండు కిడ్నీలు, ఒక లివర్ (కాలేయం), ఊపిరితిత్తులను నలుగురు రోగులకు అమర్చి వారి ప్రాణాలను కాపాడారు. ఈసందర్భంగా జీవన్‌దాన్ తెలంగాణ ఇన్చార్జి ప్రొఫెసర్ భూషణ్ రాజు మాట్లాడుతూ.. బాధిత కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు, అవసరమైన వారికి సేవలు అందించేందుకు జీవన్‌దాన్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.


