● చెరువులో పడి ఒకరి మృతి
బాన్సువాడ రూరల్: దుర్గామాత దీక్షలో ఉన్న ఓ భక్తుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. బాన్సువాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామానికి చెందిన సున్నపు శ్రీకాంత్(30) దుర్గామాత దీక్ష చేపట్టారు. సోమవారం సాయంత్రం గ్రామ చెరువులో స్నానానికి వెళ్లి ఈతరాక మృతి చెందాడు. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. మంగళవారం గజఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటకు తీయించారు. భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. శ్రీకాంత్ మృతితో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
నిజామాబాద్‌అర్బన్: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపారు. నవీపేట బాసర రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తిని రైలు ఢీకొనడంతో మృతి చెందాడన్నారు. మృతుడి వయస్సు సుమారు 40 ఏళ్ల వరకు ఉంటుందని అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712658591 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు..
మద్నూర్(జుక్కల్): వాహనం అదుపుతప్పి కిందపడిపోయిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జుక్కల్ మండల కేంద్రానికి చెందిన నాగంపల్లి రాములు(49) తన కుడిచేయి చూపుడు వేలికి గాయం కావడంతో మహారాష్ట్రలోని దెగ్లూర్‌లో ఉన్న ఆస్పత్రిలో చూయించుకుందామని తన ఎక్సెల్ వాహనంపై భార్యతో కలిసి వెళ్లారు. మండలంలోని అవాల్‌గావ్ సమీపంలో గుట్ట నుంచి కిందకు దిగుతున్న క్రమంలో వాహనం అదుపుతప్పి కింద పడిపోయారు. ఈ ఘటనలో రాములు తలకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు 108 అంబులెన్స్‌లో బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రాములు మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


