ఇంటికి రాకముందే తిరిగిరాని లోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

ఇంటికి రాకముందే తిరిగిరాని లోకాలకు..

Oct 13 2026 1:29 AM | Updated on Oct 13 2026 1:29 AM

కామారెడ్డి టౌన్‌: ‘అమ్మా.. నాన్నా.. ఈ నెల 17న ఇంటికి వస్తున్నా.. ఫ్లైట్‌ టికెట్‌ కూడా బుక్‌ చేసుకున్నా’ అంటూ కొద్దిరోజుల క్రితమే ఫోన్‌ చేసి ఆనందంగా చెప్పిన ఆ కొడుకు.. ఇంటికి రాకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. భర్త ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తాడా అని భార్య వేయి కళ్లతో ఎదురుచూస్తున్న వేళ.. ఈ పిడుగులాంటి వార్త ఆ కుటుంబాన్ని ముంచెత్తింది. కన్నవారిని, కట్టుకున్న భార్యను చూసేందుకు మరో వారం రోజుల్లో స్వదేశానికి చేరాల్సిన ఆ యువకుడు, పని ప్రదేశంలో సంభవించిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కువైట్‌లో జరిగిన ఈ దుర్ఘటనతో జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. వివరాలు ఇలా..

పైనుంచి పడ్డ టైల్స్‌.. అక్కడికక్కడే మృతి

జిల్లా కేంద్రంలోని భారత్‌రోడ్‌కు చెందిన అర్కల నారాయణ–శోభ దంపతులు పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు అర్కల రవికుమార్‌ అలియాస్‌ రాము కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు నాలుగేళ్ల క్రితం ఉపాధి కోసం కువైట్‌ వెళ్లాడు. రెండేళ్ల క్రితం స్వస్థలానికి వచ్చి వివాహం చేసుకున్నాడు. కొద్దిరోజులకే భార్య గర్భవతి కాగా, మళ్లీ బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లిపోయాడు. అక్కడ భవన నిర్మాణ పనుల్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కాగా ఈనెల 10న నిర్మాణంలో ఉన్న ఓ భవనం కింది భాగంలో రాము పనిచేస్తుండగా, ఊహించని రీతిలో పైనుంచి భారీ ముడి టైల్స్‌ జారి నేరుగా అతని తలపై పడ్డాయి. తీవ్ర రక్తస్రావమై తలకు బలమైన గాయం కావడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతుడి సోదరుడు కూడా ప్రస్తుతం కువైట్‌లోనే కార్మికుడిగా పనిచేస్తున్నాడు.

కన్న కొడుకునూ చూడలేదు.. తాళినీ నిలపలేదు..

రాము భార్య రమ్య గతంలో పండంటి బాబుకు జన్మనివ్వగా, ఆ పసికందు 5 నెలల్లోనే అనారోగ్యం, శ్వాసకోశ సమస్యలతో కొద్దిరోజులకే మృతిచెందాడు. పరాయి దేశంలో ఉన్న రాము కనీసం తన కన్న కొడుకును కూడా కళ్లారా చూసుకోలేకపోయాడు. ఆ పుత్రశోకం నుంచి తేరుకోకముందే, ఇప్పుడు ఇంటికి ఆధారమైన రాము మరణించడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. నాలుగేళ్లుగా గల్ఫ్‌ దేశంలో చెమటోడ్చిన రాము ఈ నెల 17న సెలవుపై ఇంటికి వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. తిరుగు ప్రయాణానికి సంబంధించి విమానం టికెట్‌ కూడా బుక్‌ చేసుకున్నాడు. ‘ఇంటికొస్తాడనుకున్న కొడుకు శవమై వస్తున్నాడు’ అంటూ తల్లిదండ్రులు, భార్య గుండెలవిసేలా రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిస్తోంది. మృతదేహం మంగళవారం జిల్లా కేంద్రానికి చేరుకోనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి తమ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని వారు కన్నీటితో వేడుకుంటున్నారు.

కువైట్‌లో జిల్లాకేంద్ర వాసి దుర్మరణం

ఈనెల 17న స్వదేశానికి వచ్చేందుకు

టికెట్‌ బుక్‌చేసుకున్న రాము

10న పనిప్రదేశంలో అనుకోని

ప్రమాదంలో మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement