● వరి క్వింటాలుకు రూ.3,700 వరకు చెల్లిస్తున్న వ్యాపారులు
● హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
సుభాష్‌నగర్: ఖరీఫ్‌లో వరి రైతు కష్టానికి అదృష్టం తోడైంది. ప్రస్తుతం కోతలు జరిగిన పంట వద్దకే వ్యాపారులు వచ్చి ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువ ధరతో కొనుగోళ్లు చేస్తుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో రబీలో వరి సాగు చేయకపోవచ్చనే భావనో లేదా వేరే రాష్ట్రాల్లో వరి సాగు చేయకపోవడమో.. కారణమేమైనప్పటికీ కల్లాల వద్దకే వ్యాపారులు వచ్చి పంటను కొనుగోళ్లు చేస్తుండటం జిల్లాలో జోరుగా కొనసాగుతోంది.
ధాన్యాన్ని ఆరబెట్టకుండానే..
జిల్లావ్యాప్తంగా వరి కోతలు మొదలయ్యాయి. ముఖ్యంగా వర్ని, రుద్రూర్, మోస్రా, చందూర్, కోటగిరి, బోధన్, ఎడపల్లి, తదితర మండలాల్లో 35 నుంచి 40శాతం వరకు కోతలు పూర్తయ్యాయి. మిగతా మండలాల్లో ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. ధాన్యం కోసి ఆరబెట్టి, తేమశాతం చూసిన తర్వాతే గతంలో కొనుగోళ్లు చేపట్టేవారు. కానీ ఈ సీజన్‌లో అందుకు భిన్నంగా మారింది. ప్రయివేటు వ్యాపారులు రైతు పొలం వద్దకు లారీ, హమాలీలు, బస్తాలతో వచ్చిన తర్వాత కోతలు మొదలు పెడుతున్నారు. అటు కోయడం.. ఇటు తూకం వేయడమే. ఏ ఒక్క రైతు కూడా ధాన్యం ఆరబెట్టిన దాఖలాలు లేవు. ప్రస్తుత సీజన్‌లో క్వింటాలుకు ధర రూ.3,200 నుంచి రూ.3,700 (రకాన్ని బట్టి) వరకు పలుకుతోంది. దీనికితోడు వ్యాపారులు ఎగబడి కొనుగోలు చేస్తుండటంతో పచ్చి ధాన్యంతో దిగుబడి కూడా కలిసొస్తుంది.
ప్రభుత్వ కేంద్రాలకు దూరం..
జిల్లాలో ధాన్యానికి మద్దతు ధరకు మించి ధర వస్తుండటంతో ఎక్కడ కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ప్రస్తావన రావడం లేదు. కేవలం కేంద్రాలకు కొబ్బరికాయలు కొట్టి పూజ చేసి వదిలేశారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా 6.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ లక్ష్యంపై ప్రభుత్వ యంత్రాంగం ఆశలు వదులుకున్నట్లేనని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. మార్కెట్‌లో రైతులకు మంచి ధర వస్తే.. అదే మేలు అని వారు పేర్కొంటున్నారు.


