వేల్పూర్(మెండోరా): శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. గత మంగళవారం వరకు 46 టీఎంసీలు నీరు నిల్వ ఉండగా.. ప్రస్తుతం 44 టీఎంసీలకు తగ్గింది. గుత్ప ఎత్తిపోతల పథకానికి 405, అలీసాగర్ ఎత్తిపోతల పథకానికి 540, సరస్వతి కాలువకు 670, లక్ష్మీ కాలువకు 285, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే ఎల్‌ఎండీ ఆయకట్టుకు నీరందించడానికి శనివారం నుంచి 6,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆవిరిరూపంలో 521 క్యూసెక్కుల నీరు వెళ్తోంది. కాకతీయ కాలువ ద్వారా సరఫరా చేస్తున్న నీటితో రెండు టర్బయిన్ల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.
విద్యుత్‌కోతలను నిరసిస్తూ రైతుల ధర్నా
మాక్లూర్: విధ్యుత్ కోతలు, లో వోల్టేజీ సమస్యను నిరసిస్తూ మండలంలోని అడవి మామిడిపల్లికి చెందిన రైతులు ఆలూర్ మండలం గుత్ప చౌరస్తా వద్ద విధ్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆదివారం నిరసన తెలిపారు. అనంతరం 63వ నంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. విదు్‌య్‌త్ కోతలు, లో వోల్టేజీ సమస్యపై ఏఈ వచ్చి వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. చివరకు మాక్లూర్ పోలీసులు జోక్యం చేసుకుని ఽరాస్తారోకోను విరమింపజేశారు. వ్యవసాయానికి సరఫరా చేస్తున్న 9 గంటల విద్యుత్‌లో అనేకసార్లు అవాంతరాలు ఏర్పడుతున్నాయని, లో వోల్టేజీ కారణంగా వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గుత్ప, గుత్పతండాకు చెందిన రైతులు సైతం పాల్గొన్నారు.
వరికి ట్యాంకర్‌తో నీరు
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో వరి పంటను కాపాడుకునేందుకు ఓ రైతు ట్యాంకర్‌తో నీటిని అందిస్తున్నాడు. భీమ్‌గల్ పట్టణానికి చెందిన రైతు పురస్తూ నరేశ్ ఎకరన్నర వరి సాగు చేశాడు. పంట కోతకు ఇంకా నెలరోజులు సమయం ఉండగా, బోరుబావిలో నీరు అడుగంటిపోవడంతో పంటకు నీరందడం లేదు. పంటను ఎలాగైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ట్యాంకర్ ద్వారా నీరు తీసుకువచ్చి అందిస్తున్నాడు. నీటికోసం అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చెందుతున్నాడు.


