స.హ. చట్టానికి సహాయ నిరాకరణ | - | Sakshi
Sakshi News home page

స.హ. చట్టానికి సహాయ నిరాకరణ

Oct 12 2026 8:10 AM | Updated on Oct 12 2026 8:10 AM

సామాన్యుల బ్రహ్మాస్త్రం

● సమాచారం ఇవ్వడంలో

అధికారుల కప్పదాటు వైఖరి

● నేడు సమాచార హక్కు చట్టం

అమలు దినం

సిరికొండ: ప్రజలకు ప్రశ్నించే తత్వాన్ని నేర్పిన స.హ.చట్టం వచ్చి రెండు దశాబ్దాలు దాటినా అధికారులు తమ లోపాల్ని కప్పిపుచ్చుకునేందుకు యథేచ్ఛగా తూట్లు పొడుస్తున్నారు. జిల్లాస్థాయిలో స.హ.చట్టం కింద సమాచారం ఇవ్వడానికి నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని, కొందరు అధికారులు స.హ.చట్టం నిబంధనలు తెలియనట్లు ప్రవర్తిస్తు సహాయ నిరాకరణ చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. నేడు సమాచార హక్కు చట్టం అమలు దినం సందర్భంగా జిల్లాలో స.హ.చట్టం అమలుపై ప్రత్యేక కథనం.

నిబంధనలు పట్టని అధికారులు..

సమాచారహక్కు చట్టం సెక్షన్‌ 6 ద్వారా వచ్చిన దరఖాస్తులను ప్రజా సమాచార అధికారులు పట్టించుకోవడం లేదు. సెక్షన్‌ 7(1) ప్రకారం 30 రోజులలో ఇవ్వాల్సిన సమాచారం నెలలు గడిచిన ఇవ్వడం లేదు. కొందరు అధికారులు దరఖాస్తులో తమ కార్యాలయ సమాచారం లేకపోతే ఆ సమాచారం దొరికే కార్యాలయానికి దరఖాస్తును సెక్షన్‌ 6(3) ప్రకారం ఐదు రోజులలో బదిలీ చేయాలనే నిబంధన ఉన్నా పట్టించుకోవడం లేదు. జిల్లాలో చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్చంద సమాచారానికి సంబంధించి 4(1) బి నిర్వహిస్తున్నా ప్రతి ఏడాది అప్‌డేట్‌ చేయడం లేదు. జిల్లాలో స.హ.చట్టం అమలుతీరుపై అధికారులు ఉద్యమకారులతో ప్రభుత్వ కమిటీని ఏర్పాటు చేయాలి. కానీ అధికారులు ఆ దిశగా ఆలోచించడం లేదు. అలాగే కొందరు దరఖాస్తుదారులు అడిగిన సమాచారంను మరల మరల అడుగుతూ అధికారుల పనులకు ఆటంకాలు కల్పిస్తున్నారు. మరికొందరు దరఖాస్తుదారులు ఒకే దరఖాస్తులో 60–70 ప్రశ్నలు వేస్తు అధికారులు ఆ దరఖాస్తుకు ఎక్కువ సమయం కేటాయించేలా వారి విలువైన సమయాన్ని పాడు చేస్తున్నారు. ఏదేమైనా జిల్లాలో స.హ.చట్టం అమలు పకడ్బందీగా అమలు జరిగేలా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

జక్రాన్‌పల్లి మండలానికి చెందిన ఒక దరఖాస్తుదారుడు జిల్లా కేంద్రంలోని ఇందూరు మ్యూజియంలో గల వివిధ పురాతన వస్తువుల వివరాల కోసం స.హ.చట్టం కింద అడిగిన సమాచారం ఇవ్వలేదు. మొదటి అప్పీలు వేసిన స్పందన లేదు. అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం

అందలేదు.

ముప్కాల్‌ మండలానికి చెందిన చిన్నయ్య అనే సహోద్యమకారుడు జిల్లా విద్యా శాఖ డీసీఈబీ కార్యదర్శిని ప్రయివేట్‌ పాఠశాలల నుంచి వసూలు చేసిన పరీక్ష ఫీజు వివరాలు అడగ్గా సరైన సమాచారం ఇవ్వకపోవడంతో సమాచార కమిషన్‌కు అప్పీలు చేశాడు. ఇలా జిల్లాలో ఏ శాఖలోని సమాచారం అడిగినా ప్రజలకు ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది.

ఎందరో ఉద్యమకారుల పోరాట ఫలితంగా అమలులోకి వచ్చిన స.హ.చట్టం సామాన్యుల పాలిట బ్రహ్మాస్త్రం వంటిది. దానిని పౌరులు మంచి పద్ధతిలో వినియోగించుకోవాలి. ఈ చట్టంతో వ్యక్తిగత సమస్యలు మొదలుకొని సామాజిక సమస్యల వరకు పరిష్కరించుకోవచ్చు.

–అంకం నరేశ్‌, యూఎఫ్‌ఆర్టీఐ రాష్ట్ర కోకన్వీనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement