నస్రుల్లాబాద్: మండలంలోని అంకోల్ క్యాంప్ వద్దగల రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. బాన్సువాడ పట్టణానికి చెందిన బట్టల వ్యాపారులు కారులో శుక్రవారం రాత్రి నిజామాబాద్ నుంచి బాన్సువాడకు బయలుదేరారు. అంకోల్ క్యాంప్ వద్ద వారి కారు అదుపుతప్పి మురికి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు ముందు టైరు ఊడిపోయి, అద్దాలు పగిలిపోయాయి. ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హైవే పనుల్లో భాగంగా రోడ్డు పక్కన కాలువలు తవ్వి ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు కాలేదు.
ఇందల్వాయి మండలంలో..
ఇందల్వాయి: మండలంలోని చంద్రాయన్‌పల్లి గ్రామ శివారులోగల హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి స్వల్పగాయాలయ్యాయి. ఎస్సై సుమలత తెలిపిన వివరాలు ఇలా.. చంద్రాయన్‌పల్లి గ్రామ శివారులోని 44 నంబర్ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం నిజామాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళుతున్న లారీని డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేసి ఆపడంతో అదే దారిలో వెనక వస్తున్న కారు నియంత్రణ కోల్పోయి లారీని ఢీ కొట్టింది. అనంతరం మరో రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నట్లు తెలిపారు.ఈ ఘటనలో కార్లలోని ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు. ఈ ఘటనతో ట్రాఫిక్‌జామ్ కావడంతో పోలీసులు ప్రమాదానికి గురైన కార్లను పక్కకి తొలంగించి రాకపోకలను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
డివైడర్‌ను ఢీకొని కిందపడ్డ కంటెయినర్
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్‌లో 44వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఓ కంటెయినర్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కంటైనర్ వెనుకభాగం రోడ్డుకు అడ్డంగా పడిపోడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సదరు కంటెయినర్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళుతున్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కంటెయినర్‌ను తొలగించి ట్రాఫిక్‌ను క్లీయర్ చేశారు.


