న్యూస్‌రీల్
ఏళ్లుగా వివాదాస్పదమవుతున్న వీడీసీల తీరు
బుధవారం శ్రీ 7 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
– 8లో u
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలోని గ్రామపంచాయతీల్లో సమాంతర వ్యవస్థలుగా పనిచేస్తూ వివాదాస్పదమవుతున్న వీడీసీల తీరును రాష్ట్ర బీసీ కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఇటీవల జిల్లాలోని ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో 49 కుటుంబాలను వీడీసీ సామాజికంగా బహిష్కరించిన ఘటనపై తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనతోపాటు జిల్లావ్యాప్తంగా వీడీసీల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 22 గ్రామాలకు చెందిన బాధితులతో బుధవారం నేరుగా సమావేశమై విచారణ చేపట్టనుంది.
బాధితులతో ముఖాముఖి..
అధికారులతో సమీక్ష
జిల్లాలో వీడీసీల ఆధ్వర్యంలో తరచూ సామాజిక బహిష్కరణ ఉదంతాలు చోటుచేసుకోవడం, రాష్ట్ర బీసీ కమిషన్ వరకు ఫిర్యాదులు వెళ్లడంతో కమిషన్ తీవ్రంగా స్పందించింది. బాధిత కుటుంబాల నుంచి వివరాలు తెలుసుకుని విచారణ చేపట్టడంతోపాటు భవిష్యత్‌లోనూ జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగకుండా నివారించేందుకు అధికారులతో సమీక్షించనుంది. బుధవారం ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని మీటింగ్ హాల్‌లో బాధితులతోపాటు అధికారులతో వేర్వేరుగా సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో నేడు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, డాక్టర్ రంగు బాలలక్ష్మి జిల్లాకు రానున్నారు.
తాళ్లరాంపూర్ గ్రామస్తులతోపాటు వీడీసీల ద్వారా సామాజిక బహిష్కరణ ఇబ్బందులు ఎదుర్కొంటున్న జిల్లాలోని 22 గ్రామాలకు చెందిన బాధితులను కలెక్టరేట్‌లో హాజరుపర్చాలని అధికారులను కమిషన్ ఆదేశించింది. ఉదయం 11 గంటల నుంచి 1.30 వరకు బాధితులతో ప్రత్యేకంగా సమావేశమై వివరాలను తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు జిల్లా కలెక్టర్, సీపీ, బీసీ సంక్షేమశాఖ అధికారి తదితర జిల్లా అధికారులతో సమీక్షించనున్నారు.
కుల బహిష్కరణ, సామాజిక బహిష్కరణ వంటి చర్యలతో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే జైలుకు వెళ్లకతప్పదని తెలిసినా జిల్లాలో ఇలాంటి ఘటనలు ఆగడం లేదు. చాలా సందర్భాల్లో బాధితులు ఫిర్యాదుచేసినా అధికారులు చర్యలకు వెనకాడుతుండటంతో వీడీసీల ఆగడాలు కొనసాగుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో గత కొన్నేళ్లుగా వీడీసీల తీరు తరచూ వివాదాస్పదమవుతోంది. గ్రామాల్లో స్వయం సమృద్ధి, అభివృద్ధి పేరిట గ్రామస్తుల ఐక్యత కోసం ఏర్పాటుచేసుకున్న వీడీసీలు క్రమంగా పెత్తనం చెలాయిస్తూ కొన్ని వర్గాలను ఇబ్బందు లు పెడుతున్న వైనంపై రాష్ట్ర బీసీ కమిషన్‌కు ఫి ర్యాదులు అందాయి. గత నెల 23న జిల్లాలోని ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్‌లో ఏకంగా 49 కుటుంబాలను వీడీసీ సామాజికంగా బహిష్కరించినట్టు బాధితులు సీపీ సాయిచైతన్యను క లిసి ఫిర్యాదు చేశారు. అనంతరం రాష్ట్ర బీసీ క మిషన్‌ను సైతం ఆశ్రయించారు. గ్రామంలోని 39 గౌడ కుటుంబాలతోపాటు 10 ఎస్సీ కుటుంబాలను బహిష్కరించి వారికి సహాయ నిరాకర ణ చేస్తూ ఎవరూ మాట్లాడవద్దని హుకూం జారీచేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అడ్డుకట్ట ఎప్పుడో..
జిల్లాలో కొన్నేళ్లుగా వీడీసీల ఆధ్వర్యంలో సా మాజిక బహిష్కరణ చేస్తున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. అయితే వీడీసీల ని ర్వాహకులపై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్త మవుతున్నాయి.
రెండేళ్ల కిందట వర్ని పోలీస్‌స్టేషన్ పరిధిలోని మోస్రా మండలం గోవురులో సంఘం దేవయ్య ను గొల్ల కురుమ సంఘం నుంచి బహిష్కరించడంతో తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పలు సంఘటనల్లో బాధితులు ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
గతంలో వేల్పూర్ మండలం మోతె గ్రామంలో ఇస్సాపల్లి రవి అనే వ్యక్తి ఆలయ నిర్మాణానికి స్థలం ఇవ్వలేదనే నెపంతో ఆయన కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించారు. పోలీసులు కేసులు పెట్టినా వీడీసీ బెదరలేదు. చివరకు బాధితుడే కొంత భూమి ఇచ్చేందుకు ఒప్పుకోవడంతో వివాదం ముగిసింది.
జక్రాన్‌పల్లి మండలకేంద్రంతో పాటు కొలిప్యాక్ గ్రామంలో ఓ కుటుంబంపై బహిష్కరణ వేటు వేయడంతో వీడీసీ సభ్యులపై కేసు నమోదైంది. ఇదే మండలంలోని మునిపల్లిలో తమను బహిష్కరించారంటూ నాయకపోడు కులస్తులు ఫిర్యాదుచేయడంతో వీడీసీ సభ్యులు 13 మందిపై కేసు నమోదు చేసి జైలుకుపంపారు.
వీడీసీ బాధితుల గోడు వినేందుకు
రంగంలోకి బీసీ కమిషన్
నేడు కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశం
తాజాగా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్
ఘటనతో కమిషన్ సీరియస్
జిల్లాస్థాయి అధికారులతో
సమీక్షించనున్న కమిషన్ చైర్మన్ నిరంజన్


