డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో వ్యవసాయ రంగానికి సాంకేతికతను జోడించి, అన్నదాతలకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహ కల్పించే వ్యవసా య సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ)కు ఎట్టకేలకు నిధులు విడుదలయ్యాయి. గత ఐదేళ్లుగా (2020–21 నుంచి) ఒక్క రూపాయి బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంతో సంస్థ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే ఐదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలి విడతలో జిల్లాకు రూ.22.74 లక్షలు విడుదలయ్యాయి. రాబోయే రోజుల్లో మరో విడత కూడా నిధులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నిధులు విడుదలైన నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయి కార్యాచరణను వేగవంతం చేశారు. జిల్లాలోని బాల్కొండ మినహా ఆ ర్మూర్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, బోధన్, బాన్సువాడ(ఆరు మండలాలు) నియో జవకవర్గాల్లో 25మంది రైతులతో కూడిన ‘బ్లాక్ ఫార్మర్స్ అడ్వయిజరీ కమిటీ’ల ఏర్పాటును ఏడీఏ లు పూర్తి చేశారు. ఈ రైతు కమిటీల్లో మహిళా రైతులకు ప్రాధాన్యం ప్రాధాన్యం కల్పించగా, ఎస్సీ, ఎస్టీలలో చిన్న, సన్నకారు రైతులకు సైతం అవకాశం కల్పించారు. నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటైన 25 మంది రైతు కమిటీలను కలిసి జిల్లా స్థాయిలో కూడా కమిటీని ఏర్పాటు చేయనున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలతో నేరుగా పొలాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు, రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు ఉంటాయి. ఇందుకోసం ప్రతి ఏడీఏ ఖాతాలో రూ.3.34 లక్షల చొప్పున జమ చేశారు. త్వరలోనే సుమారు వెయ్యి మంది రైతులతో భారీ ఎత్తున ‘కిసాన్’ మేళా నిర్వహించేందుకు రూ.6 లక్షలు కేటాయించారు.
ఐదేళ్ల తర్వాత సంస్థకు నిధులు
తొలి విడతగా రూ.22.74 లక్షలు
మంజూరు
ప్రారంభం కానున్న శిక్షణ కార్యక్రమాలు
త్వరలో వెయ్యి మందితో కిసాన్ మేళా
సాంకేతికతను అందిస్తాం
ఆత్మ పథకానికి నిధులు విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. జిల్లా కలెక్టర్ ఆమోదంతో నియోజకవర్గాల రైతు కమిటీల ఏర్పాటు పూర్తయ్యింది. త్వరలోనే రైతులకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించి వారికి ఆధునిక సాంకేతికతను అందిస్తాం. కిసాన్ మేళా నిర్వహణకు సన్నాహాలు కూడా చేస్తున్నాం.
– రాయుడు తిరుమల ప్రసాద్, పీడీ, ఆత్మ


