చర్యలు తీసుకుంటాం
● ఆరు నెలల్లో 35 కేసులు నమోదు
● అటవీశాఖ చర్యలతో తగ్గుముఖం పట్టిన ఆక్రమణలు
ఇందల్వాయి: అటవీ శాఖ అధికారులు చేపడుతున్న అటవీ సంరక్షణ చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. నిరంతర పర్యవేక్షణ, వేగవంతమైన చర్యల కారణంగా ఇందల్వాయి రేంజ్ పరిధిలోని అటవీ ఆక్రమణలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అడవులపై కన్నేసిన ఆక్రమణదారులపై రెవెన్యూ, పోలీస్‌శాఖలతో సమన్వయం చేసుకుంటూ అటవీ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. అడవుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇందల్వాయి రేంజ్ పరిధిలో..
ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోనే అత్యధిక అటవీ ప్రాంతం ఉంది. ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ, జక్రాన్‌పల్లి మండలాల్లోని పలు గ్రామాల పరిధిలో అడవులు విస్తరించి ఉన్నాయి. మొత్తం 123 గ్రామాలు రేంజ్ పరిధిలో ఉండగా, ఆయా ప్రాంతాల్లో అటవీ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ఇందులో ఆరు సెక్షన్‌లు, 36 బీట్లలో సుమారు 23 వేల హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. అటవీ ప్రాంతాల్లో అక్రమంగా చెట్ల నరికివేత, భూముల ఆక్రమణకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
ఈ ఏడాది ఆరు నెలల వ్యవధిలోనే 35 కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అడవుల్లోకి అక్రమంగా ప్రవేశించి చెట్లను నరికివేయడం, అటవీ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించడం వంటి చర్యలను అటవీ శాఖ సిబ్బంది అడ్డుకుంటున్నారు.
ప్రత్యేక నిఘా
అటవీ భూములను ఆక్రమించకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు, ఇప్పటికే ఆక్రమణకు గురైన ప్రాంతాలను గుర్తించి పరిశీలిస్తున్నారు. అడవుల సరిహద్దుల్లో రెగ్యులర్‌గా గస్తీ నిర్వహిస్తూ అనుమానాస్పద కదలికలపై నిఘా పెంచారు. అవసరమైన సందర్భాల్లో పోలీసు, రెవెన్యూ శాఖల సహకారంతో చర్యలు తీసుకుంటున్నారు.
అడవులను ఆక్రమిస్తూ, వన్య ప్రాణులను వేటాడే వారు ఎవరైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ, పోలీసు శాఖలు అటవీ శాఖ అధికారులకు సహకారం అందించాలి.
– రవి మోహన్ భట్, ఎఫ్‌ఆర్‌వో,
ఇందల్వాయి రేంజ్


