కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ మండలం బాబాపూర్‌లో ఇసుక అక్రమ దందా జోరుగా సాగుతోంది. ఇందిరమ్మ ఇళ్ల పేరిట వ్యాపారులు ఇసుకను డంప్ చేసి, అక్కడి నుంచి ఇతర చోటికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో ట్రాక్టర్ ఇసుక ధర సుమారు రూ.4,500 నుంచి రూ.5 వేల వరకు అమ్ముకుంటు సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా గ్రామ పరిధిలో ఇసుక తవ్వకానికి, రవాణాకు అనుమతులు ఏమేరకు ఉన్నాయో లేదో కానీ ఇసుక రవాణా మాత్రం జోరుగా కొనసాగుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో వ్యాపారుల అక్రమదందాకు అడ్డే లేకుండా పోయింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనుమతులు ఇచ్చారో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అనుమతులు లేకుండానే ఇసుకను తవ్వి తరలిస్తున్నారా లేక అధికారుల అనుమతితోనే జరుగుతోందా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక డంప్‌లను తనిఖీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


