● జీపీ ఎలక్షన్స్‌లో సొంత
డబ్బులు ఖర్చు చేసిన కార్యదర్శులు
● ఇప్పటికీ పూర్తిబిల్లులు రాకపోవడంతో చిరుద్యోగుల ఆందోళన
డొంకేశ్వర్(ఆర్మూర్): గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం సొంతంగా నిధులు ఖర్చుచేసిన జీపీ కార్యదర్శులు బిల్లులు ఎప్పుడొచ్చేనోనంటూ ఎదురుచూస్తున్నారు. ఎలక్షన్స్ ముగిసి ఏడు నెలలు గడుస్తున్నా, ఖర్చులకు సంబంధించిన నిధులు పూర్తిగా విడుదల కాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఒక్కో జీపీకి సుమారు రూ.30వేలు..
గతేడాది డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో జిల్లా వ్యాప్తంగా 545 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ కేంద్రాలు, జీపీ కార్యాలయాల వద్ద పోలింగ్ సిబ్బంది, పోలీసులు విధులు నిర్వహించారు. వారికి ముందు రోజు బస, భోజనం, ఎన్నికల రోజు అల్పాహారం, మధ్యాహ్నాం భోజనం, తాగునీరు, టీలను కార్యదర్శులే ఏ ర్పాటు చేశారు. కేంద్రాల్లో టెంట్లు, కుర్చీలు, టేబు ల్స్, లైట్లు సమకూర్చారు. దీంతో మేజర్ జీపీలకు సుమారు రూ.30వేల వరకు, మామూలు జీపీ అయితే రూ.20వేల వరకు ఖర్చయింది. ఎంపీడీవోలు కూడా సమావేశాలు, స్టేషనరీ కోసం ఖర్చు చేశారు.
వడ్డీలకు అప్పులు..
ఎన్నికల్లో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు రాకూడద ని కార్యదర్శులు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. చేతిలో పైసా లేకపోయినా విధులకు ఆటంకం కలిగించకూడదని వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించారు. మరికొందరు సొంత జీతం డబ్బులు కూడా ఎన్నికల కోసం పెట్టేశారు. మొదటి విడతగా కొన్ని డబ్బులిచ్చి సరిపెట్టారు. మిగతా డబ్బులు రాక ఏడు నెలలు అవుతోంది. ఇటీవల కార్యదర్శుల బదిలీలు జరగడంతో పాత ఊరి బిల్లుల కోసం చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి బకాయిలను వెంటనే ఇప్పించాలని వారు కోరుతున్నారు.
మొత్తం ఖర్చు (ప్రతిపాదన) రూ.12.33కోట్లు
తొలి విడత వచ్చిన నిధులు రూ.5.78కోట్లు
ఇంకా రావాల్సిన నిధులు రూ.6.55కోట్లు
మొదటి విడతలో సగం బిల్లులే..
రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా కొన్ని నిధులు రాగా, వాటినే కార్యదర్శులకు సర్ది పెట్టారు. మిగిలిన నిధులు రావాల్సి ఉందని అధికారులు సర్ధి చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనగా, కొన్ని మండలాల్లో వీడియో గ్రాఫర్లకు కూడా డబ్బులు చెల్లించలేదు. పంచాయతీ ఎన్నికల కోసం కొందరు కార్యదర్శులు తమ సొంత జీతం నుంచి, మరికొందరు అప్పులు తెచ్చి ఖర్చు చేశారు. ఇటీవల వేరే జీపీలకు బదిలీ అయిన వారు ఈ బకాయిలు ఎలా పొందాలో అని ఆందోళన చెందుతున్నారు.
రాగానే చెల్లిస్తాం..
ప్రభుత్వం జీపీ ఎన్నికల ఖర్చు కోసం మొదటి విడతలో ఇచ్చిన డబ్బులు సర్ధుబాటు చేశాం. మిగతా డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశాం. రాగానే వాటిని కూడా కార్యదర్శులకు, ఎంపీడీవోలకు చెల్లిస్తాం. – శ్రీనివాస్‌రావు, డీపీవో


