● కేంద్ర రైల్వే శాఖ మంత్రికి
విన్నవించిన ఎంపీ అర్వింద్ ధర్మపురి
సుభాష్‌నగర్: నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రైల్వే ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తిచేసేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఎంపీ అర్వింద్ ధర్మపురి కోరారు. అలాగే పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు త్వరితగతిన పరిపాలనా, ఆర్థిక అనుమతులు మంజూరు చేయా లని విన్నవించారు. ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను మంగళవారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రైల్వేలకు సంబంధించిన పలు ప్రాజెక్టులపై సమగ్రంగా చర్చించారు. నవీపేట రైల్వే క్రాసింగ్ వద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్‌వోబీ) మంజూరు చేయాలని, అలాగే డిచ్‌పల్లి రైల్వే క్రాసింగ్ వద్ద రోడ్డు అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ) నిర్మాణాన్ని చేపట్టాలని మంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశిస్తామని హామీ ఇచ్చారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి, ప్రయాణికుల భద్రత, రవాణా సౌకర్యాల మెరుగుదల కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎంపీ అర్వింద్ తెలిపారు.


