భిక్కనూరు: సాగుచేస్తున్న పోడు భూముల్లో అటవీశాఖ అధికారులు మొక్కలు నాటుతుండటంతో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించిన ఘటన రాజంపేట మండలం షేర్ శంకర్‌తండాలో మంగళవారం జరిగింది. తండాలోని పోడు భూములను పదిరోజులుగా అటవీశాఖాధికారులు దున్నుతున్నారు. తాము భూములు సాగుచేస్తున్నామని ఆన్‌లైన్‌లో తమ పేరిటే భూమి ఉందని తండావాసులు చెప్పినా అటవీశాఖాధికారులు వినకుండా ట్రాక్టర్లతో పోడు భూములను దున్నడం ప్రారంభించారు. ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అధికారులు ఎంత చెప్పినా వినకుండా తమ భూములను దున్నుతున్నారంటు ఆవేదనకు చెందిన సరోజ అనే మహిళా రైతు పురుగుల మందును సేవించింది. దీంతో అక్కడున్న వారు ఆమెను కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.


