సంక్షేమం కరువు.. విద్యార్థులకు గుబులు | - | Sakshi
Sakshi News home page

సంక్షేమం కరువు.. విద్యార్థులకు గుబులు

Jul 12 2026 3:47 AM | Updated on Jul 12 2026 3:47 AM

జిల్లాలోని గురుకులాల్లో విద్యార్థుల వివరాలు..

వసతులపై నిర్లక్ష్యం

బాన్సువాడ: గురుకుల, ఆశ్రమ పాఠశాలలోతోపాటు వసతిగృహాల్లో విద్యార్థుల సంక్షేమం ఆందోళన కలిగిస్తోంది. అధికారుల పర్యవేక్షణ కొరవడి క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వసతి, భోజనం, మౌలిక సదుపాయాలు తదితర అంశాల్లో నెలకొన్న సమస్యలు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

మొక్కుబడి తనిఖీలు

విద్యార్థుల సంక్షేమం, ఉద్యోగుల పనితీరును పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు మొక్కుబడి తనిఖీలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. లోపాలు సరిదిద్దడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సమాచారం. వంటశాలలు అపరిశుభ్రంగా ఉండటం, కూరగాయలు, సరుకులు నాణ్యత లోపించడం తదితర లోపాలు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదిలా ఉండగా ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, వసతి గృహాల వార్డెన్లు చాలా మంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హాస్టళ్లకు సమీపంలో ఉంటూ విధులు నిర్వర్తించాల్సిన వార్డెన్లు పట్టణాల్లోనే కాలం వెలదీస్తున్నట్లు సమాచారం.

వసతి ఇబ్బందులు

బాన్సువాడ ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహం ఏళ్లుగా అద్దె భవనంలో కొనసాగుతోంది. ఇరుకై న గదులు, సరిపడా స్నానాల గదులు, మూత్రశాలలు లేకపోవడంతో విద్యార్థునులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాణ్యత లేని, అపరిశుభ్రమైన ఆహారం వడ్డించడం, తాగునీటి సరఫరా సరిగా లేకపోవడంతో విద్యార్థులు తరుచూ అనారోగ్యానికి గురవుతున్నారు.

ఇటీవల జరిగిన ఘటనలు

● ఈ నెల 7న బీర్కూర్‌ మహాత్మాగాంధీ జ్యోతీభా ఫూలే గురుకుల పాఠశాలకు చెందిన 12 మంది విద్యార్థుల అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనతో ముగ్గురు అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని విధుల్లోంచి తొలగించారు. ప్రిన్సిపల్‌, ఓ ఉపాధ్యాయురాలికి షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. సెక్యూరిటీ, క్యాటరింగ్‌ నిర్వాహకులకు హెచ్చరిక నోటీసులు ఇచ్చారు.

● ఈ నెల 8న బాన్సువాడ ఎస్సీ వసతిగృహం విద్యార్థిని అమృత ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రిన్సిపల్‌ను సస్పెండ్‌ చేశారు.

గురుకులం విద్యార్థులు

బీసీ 3,783

ఎస్సీ 6,056

మైనార్టీ 2,276

గిరిజన 2,212

ఆశ్రమ పాఠశాలలు 671

ఏకలవ్య పాఠశాలలు 442

మొత్తం 15,440

ఆశ్రమ, గురుకుల పాఠశాలలు..

హాస్టళ్లలో కొరవడిన పర్యవేక్షణ

ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు

నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్న అధికారులు

వరుస ఘటనలతో ఆందోళన

గురుకుల పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల వసతులపై పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రతీ నెల పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. సంఘటన జరిగినప్పుడే చర్యలు తీసుకొని వదిలేస్తున్నారు.

– బాల్‌రాజ్‌, పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement