పారదర్శకత పెరిగింది..
● విద్యుత్ కనెక్షన్ ఇక సులభం
● డాక్యుమెంట్‌లు సరిగ్గా ఉంటే 1కి.మీలోపు ఉచితంగా ఓవర్‌హెడ్ లైన్
ఆర్మూర్: విద్యుత్ కనెక్షన్ కోసం ఇన్నాళ్లూ రైతులు, సామాన్యులు తిప్పలు పడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు టీజీఎన్‌పీడీసీఎల్ కొత్త నిబంధనలతో జిల్లాలో విద్యుత్ కనెక్షన్ ప్రక్రియ పూర్తిగా సులభతరం అయిపోయింది. గృహ, వాణిజ్య, వ్యవసాయ కనెక్షన్ కావాలంటే మీ–సేవా కేంద్రంలో దరఖాస్తు చేసి, కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు, సర్వీస్ లైన్ చార్జీ, సెక్యూరిటీ డిపాజిట్ కడితే సరిపోతుంది.
గతంలో మాదిరిగా కిలోమీటర్ల కొద్దీ ఓవర్‌హెడ్ లైన్ ఖర్చును వినియోగదారుడి నెత్తిన వేసే పద్ధతికి స్వస్తి చెప్పారు. కిలో మీటర్ వరకు ఓవర్‌హెడ్ లైన్‌ను విద్యుత్ శాఖనే ఉచితంగా వేసి సదరు వినియోగదారుడు దరఖాస్తు చేసుకున్న మీటర్‌ను బిగించి ఇవ్వనున్నారు. నిజామాబాద్ విద్యుత్ సర్కిల్ పరిధిలో ఫిబ్రవరి నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చింది. దీంతో జిల్లాలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ విద్యుత్ డివిజన్ల పరిధిలో కొత్త కనెక్షన్ కోసం చేసుకున్న దరఖాస్తులు త్వరగా క్లియర్ అవుతున్నాయి.
రైతులకు ఉపయోగకరం..
జిల్లాలో వ్యవసాయ కనెక్షన్ల కోసం గతంలో ఒక కనెక్షన్‌కు రూ. పది వేల నుంచి రూ. లక్ష దాకా లైన్ ఖర్చు అంచనా వేసేవారు. దీంతో ఆర్థిక భారం తగ్గించుకోవడం కోసం ముగ్గురు, నలుగురు రైతులు కలిసి దరఖాస్తు చేసుకొనే వారు. అధికారులు వచ్చి అంచనాలు తయారు చేసేసరికి సీజన్ అయిపోయేది. ఇప్పుడు ఆ తిప్పలు లేవు. దగ్గర్లో కిలోమీటర్ లోపు ట్రాన్స్‌ఫార్మర్ ఉంటే చాలు, డిపాజిట్ కట్టిన వెంటనే లైన్ వేసి కనెక్షన్ ఇస్తారు.
అక్రమ వసూళ్లకు చెక్..
ఈ కొత్త విధానంతో క్షేత్రస్థాయిలో జరిగే అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఎంత దూరం లైన్ ఉంది, ఎన్ని పోల్స్ కావాలి అనే తిప్పలు వినియోగదారుడికి లేవు. దరఖాస్తు చేసుకున్న మీటర్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి కిలో మీటర్ దూరం ఉండి, డాక్యుమెంట్లు సరిగ్గా ఉండి అర్హత ఉంటే వారంలో కనెక్షన్ ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయి.
కొత్త విధానం వల్ల క్షేత్రస్థాయిలో పారదర్శకత పెరిగింది. ఆర్మూర్ డివిజన్‌లోనే నాలుగు నెలల్లో దరఖాస్తు చేసుకున్న వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చాం. ఇంతకుముందు లైన్ ఎక్స్‌టెన్షన్ చార్జీల పేరుతో రైతులకు ఆర్థిక భారం ఉండేది. ఇప్పుడు ప్రభుత్వమే ఆ ఖర్చు భరిస్తోంది. అర్హత ఉన్న ప్రతి దరఖాస్తుదారుడికి ఏడు రోజుల్లో కనెక్షన్ ఇవ్వడమే మా లక్ష్యం. అనవసరంగా ఎవరూ మధ్యవర్తులను నమ్మొద్దు. నేరుగా సెక్షన్ ఆఫీస్‌లో లేదా మీ సేవలో అప్లై చేసుకోవచ్చు. –రఘు,డీఈ,
ఆర్మూర్ డివిజన్, టీజీఎన్‌పీడీసీఎల్


