షోకాజ్‌ నోటీస్‌ జారీ! | - | Sakshi
Sakshi News home page

షోకాజ్‌ నోటీస్‌ జారీ!

Jul 6 2026 2:04 AM | Updated on Jul 6 2026 2:04 AM

షోకాజ్‌ నోటీస్‌ జారీ! పండ్ల విక్రయాలకు అనువైన స్థలం కేటాయించాలి సైనిక్‌ పాఠశాలకు ఎంపిక షార్ట్‌ సర్క్యూట్‌తో ఏసీ దగ్ధం

ఖలీల్‌వాడి: ఉద్యోగుల సర్వీస్‌ బుక్‌ల మాయంపై జిల్లా కేంద్రంలోని నేషనల్‌ టెక్ట్స్‌ బుక్‌ ఆఫీస్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌కు డీఈవో పార్శి అశోక్‌ ఇటీవల షోకాజ్‌ నోటీసులు అందించినట్లు తెలిసింది. ఇద్దరు ఉద్యోగుల సర్వీస్‌ బుక్‌ల మాయంపై జూన్‌ 16న ‘సాక్షి’లో సర్వీస్‌ బు క్‌లు మాయం..! అనే శీర్షికపై కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి విద్యాశాఖ అధికారులు స్పందించారు. నెల రోజుల క్రితం మిర్చికంపౌండ్‌లోని నేషనల్‌ టెక్ట్స్‌ బుక్‌ ఆఫీస్‌లో ఇద్దరు ఉద్యోగుల సర్వీస్‌ బుక్‌లు మాయమయ్యాయి. దీంతో మేనేజర్‌ను సదరు ఉద్యోగులు నిలదీయగా స్పష్టమైన సమాధానం రాలేదు. అనంతరం వారు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, డీఈవో అశోక్‌కు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో సదరు మేనేజర్‌ శ్రీనివాస్‌ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అలాగే విద్యాశాఖ అధికారులు నాలుగైదు రోజుల క్రితం మేనేజర్‌ శ్రీనివాస్‌కు షోకాజ్‌ నోటీసులు అందించగా, సమాధానం అందించలేదని తెలిసింది. దీంతో మేనేజర్‌ శ్రీనివాస్‌పై ఆర్‌జెడీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు విద్యాశా ఖ అధికారులు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.

సుభాష్‌నగర్‌: నగరంలోని గాంధీగంజ్‌లో తోపుడు బండ్ల వ్యాపారులకు పండ్ల విక్రయాల కోసం అనువైన స్థలం కేటాయించాలని ఎంఐఎం నాయకులు కోరారు. ఈమేరకు వారు తోపుడు బండ్ల వ్యాపారులతో కలిసి ఆదివారం ఆందోళనకు దిగారు. అనంతరం వ్యాపారులు మాట్లాడుతూ.. పండ్ల బండ్లను గంజ్‌లోని మూత్రశాలల వైపు పెట్టుకోవాలని అధికారులు ఆదేశించడంతో తమ వ్యాపారం సక్రమంగా జరగడం లేదన్నారు. తోపుడు బండ్ల వ్యాపారాన్ని అడ్డుకోవడం సరికాదని, వారికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని చైర్మన్‌, అధికారులను ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజ్‌ కోరారు. వారికి న్యాయం చేయని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నగర అధ్యక్షుడు షకీల్‌, కార్పొరేటర్‌ అమర్‌, షాబాజ్‌, తోపుడు బండ్ల వ్యాపారులు పాల్గొన్నారు.

జక్రాన్‌పల్లి: మండలంలోని పడకల్‌ గ్రామానికి చెందిన సైదు అయాన్స్‌ సైనిక్‌ పాఠశాలకు ఎంపికయ్యారు. గ్రామానికి చెందిన సైదు రాము, జ్యోతి దంపతుల కుమారుడు అయాన్స్‌ ఇటీవల సైనిక్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష రాయగా, ప్రతిభ చూపి జిల్లా టాపర్‌గా, రాష్ట్ర స్థాయిలో ఆరో ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా అయాన్స్‌ను సర్పంచ్‌ లోక స్వప్న, ఉపసర్పంచ్‌ పురుషోత్తంరెడ్డి, వీడీసీ చైర్మన్‌ అంకం రాజేందర్‌, సైదు లక్ష్మణ్‌, సుదర్శన్‌, వరుణ్‌ తేజ్‌ తదితరులు అభినందించారు.

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్‌ కాలనీలోగల ఓ ఇంట్లో ఆదివా రం షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఏసీ పేలి పూర్తిగా దగ్ధమైంది. ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. సమాచారం అందుకున్న కామారెడ్డి అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 2లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు తెలిపారు. విషయం తెలుసుకున్న మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గడ్డం ఇందుప్రియ, 14వ వార్డు కౌన్సిలర్‌ రాంశెట్టి హర్షిత ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement