సుభాష్‌నగర్: క్రీడలు పిల్లల్లో శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అమేచూర్ తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య అన్నారు. నగరంలోని బస్వాగార్డెన్‌లో అమేచూర్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు కలర్ బెల్టులు, సర్టిఫికెట్ల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈను అసోసియేషన్ ప్రధానకార్యదర్శి, కోచ్ మనోజ్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. బెల్టు ప్రమోషన్ పరీక్షల్లో అర్హత సాధించిన సుమారు 150 మంది క్రీడాకారులకు జిల్లా యువజన, క్రీడల అధికారి పవన్‌కుమార్, క్రీడా సంఘాల ప్రతినిధి బొబ్బిలి నర్సయ్యతో కలిసి బస్వా లక్ష్మీనర్సయ్య బెల్టులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు అభినందనీయులన్నారు. ప్రతిరోజూ క్రీడామైదానంలో సాధన చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనశైలితోపాటు విద్యారంగంలో కూడా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం చిన్నారులు ఫోన్లు, టీవీలు, ఇతర డిజిటల్ పరికరాలకు బానిసలు అవుతున్నారని, వారిని క్రీడల్లో పాలుపంచుకోవడం వల్ల వారి భవిష్యత్ మరింత ఉజ్వలంగా మారుతుందన్నారు. కోచ్ మనోజ్‌కుమార్, గంగాధర్, నాగరాజ్, శివకుమార్, నితిన్, సిద్ధార్థ, గోపికృష్ణ, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.


