తర‘గతి’ ఏదీ..? | - | Sakshi
Sakshi News home page

తర‘గతి’ ఏదీ..?

Jul 6 2026 1:22 AM | Updated on Jul 6 2026 1:22 AM

అసౌకర్యాల బడులు.. తీరని అవస్థలు

శిథిలావస్థకు చేరిన తరగతి గదులు..

మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక

ఇబ్బందులు

వేల్పూర్‌ మండలం రామన్నపేటలోని ఉన్నత పాఠశాలలో తొమ్మిది గదులు ఉండగా, మూడు గదులు మాత్రమే బోధనకు అనుకూలంగా ఉన్నాయి. స్లాబు పెచ్చులూడుతున్న ఒక గదిని మధ్యాహ్న భోజనం అవసరాలకు వాడుతుండగా, ఒకటి హెడ్మాస్టర్‌, మరోటి ఉపాధ్యాయు లు, సిబ్బంది వాడుకుంటున్నారు. శిథిలావస్థకు చేరి కూలిపోయే ప్రమాదం ఉన్న మరో మూడు గదులకు తాళం వేశారు. మిగిలిన మూడు గదుల్లో తరగతులను కొనసాగిస్తున్నారు. ‘మన – ఊరు మనబడి’ కింద ఐదు గదుల నిర్మాణానికి గత ప్రభుత్వం రూ. 75 లక్షలు మంజూరు చేసింది, కానీ నిధులు సరిపోవని కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాలేదు. కొత్త తరగతి గదుల నిర్మాణం జరగలేదు. దీంతో పాఠశాలలో బోధన కోసం గదుల కొరత ఏర్పడింది.

రెంజల్‌ మండలం కందకుర్తి జెడ్పీ ఉన్నత

పాఠశాలలో నిలిచిన మరుగుదొడ్డి పనులు

సాలూరా క్యాంప్‌ పాఠశాల వరండాలో మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులు

బోధన్‌/ఖలీల్‌వాడి/కమ్మర్‌పల్లి: జిల్లాలో మొత్తం 1156 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 5,292 మంది టీచర్లు పనిచేస్తున్నారు. 40 స్కూళ్లు ‘పీఎం శ్రీ’ కి ఎంపికయ్యాయి. రేషనలైజేషన్‌లో భాగంగా 33 స్కూళ్లు మూతపడ్డాయి. 270 స్కూళ్లలో 507 మూత్రశాలల నిర్మాణానికి అనుమతి రాగా కొన్ని చోట్ల పనులు ప్రారంభమయ్యాయి. మరికొన్ని చొట్ల పనులు జరగడం లేదు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు మరో 103 స్కూళ్లలో మూత్రశాలల నిర్మాణం చేపట్టనున్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద ఒక్కొక్క స్కూల్‌కు రూ.2 లక్షలు కేటాయించారు.

బోధన్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు నెలకొని విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఏళ్లు గడిచినా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. పలు పాఠశాలల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. గదులు, ఉపాధ్యాయుల కొరత, సరిపడా మరుగుదొడ్లు, మూత్రశాలల లేక విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.

సాలూర మండల కేంద్రంలోని పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌లో తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలో 6 నుంచి 10వ తరగతి వరకు 270 మంది విద్యార్థులుండగా, 9 గదులు మాత్రమే ఉన్నాయి. గదుల కొరత వల్ల డైనింగ్‌ హాల్‌, కంప్యూటర్‌, సైన్స్‌ల్యాబ్‌, లైబ్రరీ గదులు, పాఠశాల వరండాలో, చెట్టు కింద తరగతులు కొనసాగుతున్నాయి.

మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 125 మంది విద్యార్థులుండగా, నాలుగు గదులు ఉన్నాయి. గదుల కొరత కారణంగా వరండాల్లో రెండు తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది పాఠశాలకు ప్రీప్రైమరీ స్కూల్‌ మంజూరైంది.

ఉర్దూమీడియం ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటి నుంచి ఏడు తరగతులకు నాలుగు గదులున్నాయి. ఒక గదిలో రెండు తరగతులను కొనసాగిస్తున్నారు.

రెంజల్‌ మండలంలోని కందకుర్తి ఉర్దూమీడియం జెడ్పీహెచ్‌ఎస్‌లో 173 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులున్నారు. ఓ ట్రస్ట్‌ తరఫున మరో ముగ్గురు విద్యావలంటీర్లను నియమించారు. నీటి సౌకర్యం లేక మరుగుదొడ్డి, మూత్రశాలలు వినియోగంలో లేవు. బాలికల కోసం చేపట్టిన మరుగుదొడ్డి నిర్మాణ పనులు ఏడాది నుంచి అర్ధంతరంగా నిలిచిపోయాయి. కందకుర్తి గ్రామ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో 167 మంది విద్యార్థులకుగాను ఇద్దరు ఎస్‌జీటీలు ఉన్నారు.

బోధన్‌ పట్టణంలోని శక్కర్‌నగర్‌ మధుమలాంచ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 268 మంది విద్యార్థులుండగా, ఇందులో 103 మంది బాలికలున్నారు. ఇక్కడా సరిపడా మరుగుదొడ్లు, మూత్రశాలల సౌకర్యం లేదు.

రుద్రూర్‌లోని జవహార్‌ నగర్‌ కాలనీ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో అసలు మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు. హరిజన వాడ ఎంపీఎస్‌ భవనం శిథిలావస్థకు చేరింది.రోడ్డు విస్తరణ పనుల్లో పాఠశాల మరుగుదొడ్లు, మూత్రశాలలను కూల్చి వేశారు.

కోటగిరి మండలంలోని లింగాపూర్‌, పొతంగల్‌ మండలంలోని కొల్లూర్‌ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలకు సొంత భవనాలు లేక గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నారు.

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తరగతుల వారీగా గదులు లేకపోవడంతో వరండాల్లో, చెట్ల కింద విద్యాబోధన సాగుతోంది. ఒకే వరండాలో వేర్వేరు తరగతుల వారు కూర్చుంటుండడంతో వారి పాఠాలు వీరికి.. వీరి పాఠాలు వారికి.. అన్నట్లుగా ఉంటోంది పరిస్థితి. జిల్లాలోని 194 ప్రభుత్వ బడుల్లో 444 గదులు శిథిలావస్థకు చేరుకోగా, వాటిని కూల్చివేయాల్సి ఉంది. అలాగే 19 స్కూళ్లలో 55 గదుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 282 పాఠశాలల్లోని 602 గదులకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది.

సాలూర క్యాంప్‌ మండల పరిషత్‌ ప్రాథ మిక పాఠశాలలో 16 మంది విద్యార్థులు, ఒక టీచర్‌ ఉన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఒకే గదిలో ఐదు తరగతులు నిర్వహిస్తున్నారు. ఒకటో తరగతిలో అసలు విద్యార్థులు లేకపోగా, రెండో తరగతిలో నలు గురు, మూడో తరగతిలో ఆరుగురు, నాల్గో తరగతిలో ఇద్దరు, ఐదో తరగతిలో నలుగురు విద్యార్థులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement