● పేరుకుపోయిన నీటి పన్ను బకాయిలు
● నిధులు లేక నిస్సహాయ స్థితిలో
నిర్వహణ కమిటీ
బోధన్: మంజీర నదిపై సాలూర శివారులో నిర్మించిన ఎత్తిపోతల పథకానికి నిధులు లేక మళ్లీ తాళం పడింది. గత వానాకాలం సీజన్‌కు మూడు నెలల ముందు ఎత్తిపోతల పథకం ప్రధాన పంప్‌హౌజ్‌లో ఎలక్ట్రికల్ ప్యానెల్‌బోర్డుతోపాటు ఇతర సామగ్రిని దుండగులు ఎత్తుకెళ్లారు. స్థానిక ప్రజాప్రతినిధులు, రైతుల సహకారంతో నిధులు సమకూర్చి పథకాన్ని ఉపయోగంలోకి తీసుకొచ్చారు. ఈ ఏడాది సిబ్బంది వేతన బకాయిలు, పైప్‌లైన్ లీకేజీ మరమ్మతులు, ఇతర పనులకు నిధులు లేకపోవడంతో తాళం వే శారు. పథకం పరిధిలోని రైతులు మెట్ట భూమి ఎక రానికి రూ.800, మాగాణికి రూ.వెయ్యి చొప్పున చెల్లించాల్సి ఉండగా సుమారు రూ.10 లక్షల వరకు బకాయిలు పేరుకుపోయాయి. గత రెండు నెలలకాలంలో బకాయిల వసూళ్లు, పథకం నిర్వహణపై మూడు సార్లు రైతులతో సమావేశాలు నిర్వహించా రు. బకాయిల వసూళ్ల కోసం కమిటీ ప్రతినిధులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో రూ.3 కోట్లు మంజూరు చేయగా పథకం రూపుదిద్దుకుంది. 2006–07లో పనులను పూర్తిచేసి 1,600 ఎకరాలను స్థిరీకరించారు.
బకాయిలు చెల్లించి సహకరించాలి
ఆయకట్టు రైతులు నీటి ప న్ను బకాయిలు చెల్లించి సహకరించాలి. ప్రస్తుతం పథకం ప్రారంభానికి నిధుల కొరత ప్రధాన సమస్యగా ఉంది. సిబ్బందికి వేతనాలు, పైప్‌లైన్ లీకేజీ మరమ్మతులు, ఇతర పనులకు నిధులు అవసరం. రైతుల సహకారం ఉంటేనే పథకం నిర్వహణ సాధ్యమవుతుంది. – శివకాంత్ పటేల్,
ఎత్తిపోతల పథకం నిర్వహణ కమిటీ చైర్మన్


