● సాంకేతిక కారణాలతో 52 మందికి
అందని వేతనాలు
● తొలి వేతనాన్ని అందుకోలేక పోయిన ప్రథమ పౌరులు
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో సర్పంచుల వేతనాల పంపిణీకి సాంకేతిక కారణాలు అడ్డుగా మారాయి. జీరోతో మొదలయ్యే బ్యాంకు ఖాతా, ఐఎఫ్‌ఎస్‌సీ నంబర్ల కారణంగా 52 మందికి వేతనాలు నిలిచిపోయాయి. సర్పంచులుగా గెలిచిన తర్వాత మంజూరైన తొలి వేతనాన్ని అందరితోపాటు తాము అందుకోలేకపోయామనే బాధలో ఉన్నారు. జిల్లాలో 545 మంది సర్పంచులు ఉండగా, వీరికి రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో 5 నెలల 10రోజుల కాలానికి సంబంధించిన వేతనాలను విడుదల చేసింది. ట్రెజరీ ద్వారా జీతాలు జమ చేసేందుకు జిల్లా పంచాయతీ అధికారులు సర్పంచుల బ్యాంక్ ఖాతా వివరాలు సేకరించారు. 545 మందికిగాను 493 మంది బ్యాంకు ఖాతాల్లో పక్షం రోజుల క్రితం వేతనాలు జమయ్యాయి. మిగిలిన 52 మందికి సంబంధించిన యూనియన్ బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్‌ఎఫ్‌సీ కోడ్ భిన్నంగా ఉండడంతో వేతనాలకు బ్రేక్ పడింది. ట్రెజరీ సాఫ్ట్‌వేర్ విధానంలో జీరోతో మొదలయ్యే ఖాతా నంబర్లు ప్రాసెస్ కాకపోవడమే ఇందుకు కారణం. సహచర సర్పంచులందరికీ వేతనా లు జమ కాగా, తమకు మాత్రమే మొండి చేయి ఎదురుకావడంతో బాధిత సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై జిల్లా కార్యాలయంలో సంబంధిత అధికారిని ‘సాక్షి’ వివరణ కోరగా, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే పరిష్కరించి సర్పంచుల ఖాతాల్లో వేతనాలు జమయ్యేలా చూస్తామని అన్నారు.


