తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 1, 2, 3, 4, 5, 6వ సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ (2016, 2017, 2018, 2019, 2020 ) బ్యాచ్‌ల వన్‌టైమ్ చాన్స్ పరీక్షలు శనివారం ప్రారంభమైనట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. పరీక్షకు 47 మంది విద్యార్థులకు 43 మంది హాజరుకాగా నలుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాన్ని వర్సిటీ కంట్రోలర్ ప్రొఫెసర్ కే సంపత్ కుమార్ తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు.
బిచ్కుంద(జుక్కల్) : పట్టణంలోని సబ్‌రిజిస్టర్ కార్యాలయంలో శనివారం బిచ్కుందకు చెందిన ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యుల ఆస్తి పంపకాలు జరగలేదని, తమకు రావాల్సిన వాటా ఇవ్వకుండా చిన్నాన్న కొడుకు అమ్ముకుంటున్నాడని ఆరోపించాడు. రిజిస్ట్రేషన్ చేయవద్దని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు పెట్రోల్ బాటిల్‌ను లాక్కొని పోలీసులకు సమాచారం అందించారు. కార్యాలయానికి చేరుకున్న పొలీసులు ఇరువర్గాలను సముదాయించారు.
● అదుపులోకి తీసుకున్న పోలీసులు
భిక్కనూరు: మద్యం మత్తులో యువకులు గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ను ఎత్తుకెళ్తూ జీపీ ప్రహరీ, బోరు మోటార్లను ధ్వంసం చేసిన ఘ టన మండలంలోని పెద్దమల్లారెడ్డిలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉ న్నాయి. గ్రామానికి చెందిన నలుగురు యువకులు శుక్రవారం రాత్రి మద్యం సేవించి అర్ధరాత్రి దాటిన తర్వాత గ్రామ పంచాయతీ వద్ద ఉన్న ట్రాక్టర్‌ను స్టార్ట్ చేసి మత్తులోనే నడు పుతూ ప్రహరీని, తాగునీటి బోరుమోటార్లను ధ్వంసం చేశారు. అనంతరం గ్రామంలోని ఎ స్సీ కాలనీలో ట్రాక్టర్‌ను నిలిపేసి ఇళ్లకు వెళ్లిపోయారు. శనివారం ఉదయం విషయం తెలుసుకున్న సర్పంచ్ సాయాగౌడ్ ఓ యువకుడిని తీసుకొచ్చి ప్రశ్నించగా సరైన సమాధానం రాలేదు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
బాన్సువాడ : పట్టణంలోని పాత బాన్సువాడ బ్రిడ్జి వద్ద శనివారం సాయంత్రం విద్యుత్ షాక్ తగిలి రెండు గేదెలు మృతి చెందాయి. పాత బాన్సువాడలోని కుర్మ సాయిగొండకు చెందిన రెండు గేదెలు మేతకు వెళ్లి ఇంటికి వస్తుండగా ఇనుప స్తంభానికి తలగడంతో షాక్ తగిలి మృతి చెందాయి. దీంతో సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు సాయిగొండ తెలిపారు. విద్యుత్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా చేశారు.
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెందిన సింగరాయపల్లి రమేశ్ అనే వ్యక్తి లక్కీ డ్రా ద్వారా భూమిని విక్రయిస్తున్నట్లు చేస్తున్న ప్రచారంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పుష్పరాజ్ శనివారం తెలిపారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ.999 చొప్పున వసూలు చేసి రశీదులు సైతం ఇస్తున్నాడనే సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నామన్నారు. లక్కీ డ్రాకు అనుమతులు లేవని పేర్కొన్నారు.


