కామారెడ్డి క్రైం: పోలీసులు, ప్రజల భాగస్వామ్యంతోనే నేరరహిత సమాజం నిర్మాణం అవుతుందని ఎస్పీ రాజేశ్‌చంద్ర పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని రాజీవ్‌నగర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కాలనీలో శనివారం వేకువజాము నుంచి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మొత్తం 160 మంది పోలీసు అధికారులు, సిబ్బంది కలిసి ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. 11 వాహనాలు నంబర్ ప్లేట్లు లేనివి సహా మొత్తం 121 బైక్‌లు, 36 ఆటోలు, 2 కార్లు, 18 బీర్ బాటిళ్లు, 12 క్వార్టర్ మద్యం బాటిళ్లు, ఒకరి వద్ద నుంచి తల్వార్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేశ్‌చంద్ర మాట్లాడుతూ నేరాల నివారణలో ప్రజలను భాగస్వాములను చేయడమే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రతి పౌరుడు చట్టాలను గౌరవిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరారు. సోషల్ మీడియాలో కత్తులు, తల్వార్లు, ఇతర మారణాయుధాలతో ఫొటోలు, వీడియోలు పోస్టు చేసి యువతను రెచ్చగొట్టేలా, ప్రజల్లో భయాందోళనలు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల రవాణా, నిల్వ, విక్రయం, కొనుగోలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. చెడు వ్యసనాలకు బానిస కాకుండా ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, స్నేహాలు, రోజువారీ అలవాట్లను గమనించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, దొంగతనాలు, గంజాయి లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌న్‌కు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. అనంతరం అక్కడే ఉన్న కొందరు అనుమానితులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి, వారి సమస్యలు, జీవనశైలిని తెలుసుకున్నారు. నేరాలకు దూరంగా ఉండి మంచి ప్రవర్తన కనబరిస్తే నిబంధనల మేరకు షీట్ల తొలగింపును పరిశీలిస్తామని చెప్పారు. కార్యక్రమంలో డీఎస్పీ మధుసూదన్, పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి, రూరల్ సీఐ శ్రీధర్, భిక్కనూర్ సీఐ నరేశ్, ఆర్‌ఐలు సంతోష్, నవీన్, కృష్ణ, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు
పాల్పడితే కఠిన చర్యలు
ఎస్పీ రాజేశ్‌చంద్ర
రాజీవ్‌నగర్‌లో కార్డన్ సెర్చ్
121 బైక్‌లు, 36 ఆటోలు, 2 కార్లు,
ఒక తల్వార్, మద్యం బాటిళ్లు స్వాధీనం


