కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలో జరిగిన రెండు వేర్వేరు చోరీ కేసులను కామారెడ్డి పోలీసులు ఛేదించారు. నిందితుల వివరాలను డీఎస్పీ మధుసూదన్ శనివారం వెల్లడించారు.
పెళ్లి వేడుకలో ఆటో డ్రైవర్ చేతివాటం..
పెద్దపల్లికి చెందిన విద్యార్థిని వోలెల్ల నందిని గత నెల 29న కన్యకాపరమేశ్వరి ఆలయం పక్కన ఉన్న వైశ్య భవన్‌కు ఓ శుభకార్యం కోసం వచ్చారు. గది లో ఉంచిన ఆమె బ్యాగు నుంచి గుర్తుతెలియని వ్య క్తి 12 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగిలించాడు. బాధితురాలి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు జిల్లా కేంద్రంలోని డ్రైవర్స్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ మొహమ్మద్ అప్సర్ అలీగా గుర్తించి అరెస్ట్ చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక ఆర్థిక ఇబ్బందుల వల్లే దొంగతనానికి పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకోగా, అతని నుంచి నగలను రికవరీ చేశారు.
అత్త ఇంట్లో అల్లుడు చోరీ..
జిల్లా కేంద్రంలోని గంజ్ రోడ్‌కు కొత్తూరి పద్మ ఇంట్లో గత నెల 28న బీరువా తాళాలు తీసి, 3 తులాల బంగారు ఆభరణాలు ఓ వ్యక్తి అపహరించారు. బాధితురాలి ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు హరిజనవాడకు చెందిన చింతకింద బాలమురళీకృష్ణను అరెస్ట్ చేశారు. వరుసకు అత్త అయ్యే పద్మ ఇంటి తాళాలు గతంలో తన వద్ద ఉండటం, నగల ఉంచే స్థలం తెలియడంతోనే ఈ చోరీకి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు. దొంగిలించిన నగలను ఐఐఎఫ్‌ఎల్, కాప్రి గోల్డ్ లోన్స్‌లో తాకట్టు పెట్టగా, వాటితోపాటు తన టిఫిన్ సెంటర్‌లో దాచిన మూడు పుస్తెలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో పట్టణ సీఐ నరహరి తదితరులున్నారు.
వైశ్యభవన్ వద్ద దొంగతనంలో
ఆటో డ్రైవర్..
గంజ్ రోడ్‌లో అత్త ఇంటిని
దోచిన అల్లుడు అరెస్ట్
వివరాలు వెల్లడించిన
డీఎస్పీ మధుసూదన్


