ఒకరి ఆత్మహత్య
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మద్యానికి బానిసైనా ఓ వ్యక్తి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగిరెడ్డిపేట మండలం తాండూర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై భార్గవ్‌గౌడ్ కథనం ప్రకారం.. తాండూర్ చెందిన ధారబోయిన నాగరాజు(30) మద్యానికి బానిసై ఇంట్లో గొడవపడి శనివారం వేకువజామున ఇంటి నుంచి బయటికివెళ్లాడు. గ్రా మ శివారులోని నాగనయ్య చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య వినోదతోపాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
న్యాల్‌కల్‌లో మరొకరు..
మోపాల్ : మండలంలోని న్యాల్‌కల్ గ్రామానికి చెందిన మోస్ర పోశెట్టి (47) శుక్రవారం అర్ధరాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోశెట్టి మేసీ్త్ర పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తాగుడుకు బానిసైన పోశెట్టి దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కుటుంబకలహాలతో కలత చెందిన పోశెట్టి క్షణికావేశానికి గురై ఇంట్లోనే ఉరేసుకున్నాడు. మృతుడికి భార్య రమ, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.
మద్నూర్(జుక్కల్): సలాబత్‌పూర్ వద్ద శనివారం జాతీయ రహదారి 161 దాటుతున్న వ్యక్తి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సలాబత్‌పూర్ గ్రామానికి చెందిన ఇబిత్వార్ ప్రకాశ్(44) శనివారం రాత్రి జాతీయ రహదారి దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ఆయన మృతి చెందాడు. మృతదేహాన్ని మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


