క్షణికావేశం.. శాశ్వత నష్టం | - | Sakshi
Sakshi News home page

క్షణికావేశం.. శాశ్వత నష్టం

Jul 4 2026 2:49 AM | Updated on Jul 4 2026 2:49 AM

తొందరపాటు నిర్ణయాలు వద్దు..

అవగాహన కల్పిస్తున్నాం..

కామారెడ్డి జిల్లాలో పెరుగుతున్న

బలవన్మరణాలు

చిన్నచిన్న కారణాలతోనే తమ

జీవితాలను ముగించుకుంటున్న జనం

రామారెడ్డి(ఎల్లారెడ్డి): నిమిషం ఆవేశం.. క్షణికావేశం.. చిన్నపాటి మనస్పర్థలు.. వెరసి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. జీవితం విలువ తెలిసిన వారు సైతం అతి చిన్న కారణాలతో మృత్యువు ఒడిలోకి చేరుతుండటం జిల్లాలో ఆందోళనకరంగా మారింది. జీవితం అనేది ఎన్నో ఆశల సమాహారం. సమస్యలు రావడం సహజం, కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కోవడమే నిజమైన జీవన పోరాటం. సమస్య ఏదైనా, పరిష్కారం కోసం ఆలోచించకుండా ఆత్మహత్యే మార్గంగా ఎంచుకోవడం ఇప్పుడు ఈ ప్రాంతాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది..

ఆరు నెలల్లోనే 213 మంది..

జిల్లా వ్యాప్తంగా ఆత్మహత్యల పరంపర అగడం లేదు. జనవరి 2026 నుంచి జూలై 2 వరకు సుమారు 213 మంది వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడారు. ప్రధానంగా రామారెడ్డి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గత ఏడాది (2025) సుమారుగా 18 మంది చిన్నచిన్న కారణాలతోనే తమ జీవితాలను ముగించుకున్నారు. ప్రస్తుత ఏడాది ఇప్పటివరకు సుమారు 10 మంది ఆత్మహత్యలకు పాల్పడటం గమనార్హం. ఈ ఏడాది ప్రాణాలు తీసుకుంటున్న వారిలో వృద్ధులు ఎక్కువగా ఉండటం సమాజంలో నెలకొన్న అభద్రతా భావాన్ని, ఒంటరితనాన్ని ప్రతిబింబిస్తోంది. 18 ఏళ్ల నిండిన యువత నుంచి పండు ముసలి వరకు అందరూ ఈ విషవలయంలో చిక్కుకోవడం విచారకరం.

అవగాహన సదస్సులు అవసరం..

సమాజంలో ‘ఆత్మహత్యల మహమ్మారి’ని అరికట్టడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. రామారెడ్డి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అత్యధికంగా ఆత్మహత్యలు జరుగుతున్నా, అటు పోలీసు యంత్రాంగం గానీ, ఇటు స్వచ్ఛంద సంస్థలు గానీ ఇప్పటివరకు ఎటువంటి అవగాహన సదస్సులు నిర్వహించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా పోలీస్‌ యంత్రాంగం గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. అలాగే యువత, వృద్ధులకు మానసిక స్థైర్యాన్ని ఇచ్చేందుకు నిపుణులతో కౌన్సెలింగ్‌ ఏర్పాటు చేయాలంటున్నారు.

రామారెడ్డి మండల కేంద్రంలో గతంలో పక్కింటి వారితో వాకిలి శుభ్రం చేసే విషయంలో జరిగిన చిన్నపాటి గొడవను మనసులో పెట్టుకుని ఓ మహిళ పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంది. మండలంలోని మరో గ్రామంలో ఆటో రిపేరు కోసం తల్లి డబ్బులు ఇవ్వలేదన్న చిన్నపాటి అసహనంతో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇవి కేవలం మచ్చుకు మాత్రమే. ఇలాంటి సంఘటనలు నిత్యం ఎక్కడో అక్కడ వెలుగుచూస్తున్నాయి.

తొందరపాటుతో తప్పుడు నిర్ణ యాలు తీసుకోవద్దు. సమా జం తనను దూరం చేసిందనే భావనలో ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. అలాంటి వారి లో మార్పులు వచ్చిన వెంటనే కుటుంబ సభ్యులు గుర్తించాలి.

–రమణ, జిల్లా మానసిక వైద్యాధికారి

పోలీస్‌ కళాబృందాల ద్వారా గ్రామాలలో ఆత్మహత్యలపై అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నాం. రామారెడ్డి మండలంలో మరింత ఎక్కువగా ఆత్మహత్యలపై అవగాహన సదస్సులను నిర్వహిస్తాం.

–శ్రీధర్‌గౌడ్‌, రూరల్‌ సీఐ, కామారెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement