నాణ్యమైన ఆహార పదార్థాలను విక్రయించాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన ఆహార పదార్థాలను విక్రయించాలి

Jul 4 2026 2:49 AM | Updated on Jul 4 2026 2:49 AM

నాణ్యమైన ఆహార పదార్థాలను విక్రయించాలి గోడను ఢీకొన్న లారీ.. తెగిన విద్యుత్‌ వైర్లు తండ్రికి తలకొరివి పెట్టిన తనయ

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌): వినియోగదారులకు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహార పదార్థాలను విక్రయించాలని భీమ్‌గల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ గజానంద్‌ దుకాణాదారులకు సూచించారు. భీమ్‌గల్‌ పట్టణంలోని పలు తినుబండారాల దుకాణాలను శుక్రవారం ఆయన సందర్శించి, వర్షాకాలంలో ఆహార పదార్థాల పరిశుభ్రతపై యజమానులకు అవగాహన కల్పించారు. హోటల్‌, స్వీట్‌హోమ్‌, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌, బేకరీ, ఇతర తినుబండారాల దుకాణాదారులు విక్రయించే తినుబండారాలపై ఈగలు, దోమలు, ఇతర క్రిమీకీటకాలు వాలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దుకాణాల నుంచి వెలువడే చెత్తను, చికెన్‌, మటన్‌ సెంటర్ల నుంచి వెలువడే వ్యర్థాలను రోడ్ల పక్కన పడవేయకుండ, మున్సిపల్‌ చెత్త వాహనాలకు అందించాలన్నారు. లేదంటే దుకాణాదారులకు జరిమానా విధించడంతోపాటు తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాగ్రత్తలను తెలియజేస్తూ పలు దుకాణాదారులకు నోటీస్‌లను అందజేశారు. వార్డు ఆఫీసర్లు రాజేశ్వర్‌, ఓంకార్‌ తదితరులు పాల్గొన్నారు.

రైళ్ల రాకపోకలకు అంతరాయం

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని రైల్వే స్టేషన్‌ సమీపంలోని గంజి ప్రాంతంలో శుక్రవారం ఓ లారీ గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో గోడకు ఉన్న గేటు పడిపోగా, దానికున్న ఇనుప గేటు రాడు సమీపంలోని రైల్వే విద్యుత్‌ వైర్లను బలంగా తాకింది. దీంతో విద్యుత్‌ వైర్లు తెగిపోయి, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు కొన్ని గంటల పాటు విద్యుత్‌ వైర్లను పునరుద్ధరించగా, రైళ్ల రాకపోకలు జరిగాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

కామారెడ్డి టౌన్‌/కామారెడ్డి అర్బన్‌: మున్సిపల్‌ పరిధిలోని లింగాపూర్‌ గ్రామంలో మృతిచెందిన తండ్రికి కూతురు తలకొరివి పెట్టిన ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన వడ్ల బాలయ్య శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు కాగా, కొడుకులు లేరు. తండ్రి ఇక లేరన్న వార్త ఒకవైపు గుండెను పిండేస్తుంటే.. కొడుకు లేడనే కారణంతో తండ్రి కడసారి సంస్కారాలకు ఎలాంటి లోటు రాకూడదని ఆ చిన్న కూతురు జ్యోతి గుండె నిబ్బరం చేసుకుంది. సమాజంలోని పాత ఆచారాలను పక్కనబెట్టి, తానే కొడుకై ముందు నిలిచింది. తలకొరివి పెట్టి దహన సంస్కారాలు పూర్తి చేసింది. కూతురే కొడుకై తండ్రి రుణం తీర్చుకున్న ఈ దృశ్యం అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరి గుండెలను పిండేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement