ఏఐపై అవగాహన.. బోధన | - | Sakshi
Sakshi News home page

ఏఐపై అవగాహన.. బోధన

Jul 4 2026 2:49 AM | Updated on Jul 4 2026 2:49 AM

తరగతులు ప్రారంభమయ్యాయి..

ప్రభుత్వ బడుల్లో వారంలో

రెండు రోజులు క్లాసులు

డిగ్రీ విద్యార్థులతో టీచింగ్‌

ఖలీల్‌వాడి: ప్రభుత్వ బడుల్లో చదివే పేద విద్యార్థులకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)ను పరిచయం చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ‘అన్న–అక్క మెంటార్‌షిప్‌’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది. ఏఐ సాయంతో విద్యను విద్యార్థులకు సులభంగా అందుబాటులోకి తెచ్చారు.

లెక్చరర్లు, డిగ్రీ విద్యార్థులకు శిక్షణ..

జిల్లాలోని డిగ్రీ ఫైనలియర్‌ విద్యార్థులతో పాటు లెక్చరర్లకు ఇటీవల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వారితో స్థానికంగా ఉన్న ప్రభుత్వ బడుల్లోని 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు కంప్యూటర్‌ టీచింగ్‌ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఏఐ బోధనలో విద్యార్థులకు స్నేహంగా ఉంటూనే మార్గనిర్ధేశకం చేసేందుకు డిజిటల్‌ పాత్రలను రూపొందించారు. పాఠాలను చదవడమే కాకుండా యానిమేషన్లు, ఫోటోలు(చిత్రాలు), కథలు, వీడియోల ద్వారా విద్యార్థులకు సులభంగా బోధిస్తున్నారు.

బోధకులకు క్రెడిట్‌ పాయింట్లు..

డిగ్రీ విద్యార్థులు సుమారు 30 గంటల తరగతులు బోధించాల్సి ఉంటుంది. నెల నుంచి రెండు నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందుకు గాను డిగ్రీ విద్యార్థులకు క్రెడిట్‌ పాయింట్లు కేటాయించనున్నారు.

విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు..

విద్యార్థులకు కంప్యూటర్‌పై అవగాహనతోపాటు సాంకేతిక నైపుణ్యాలు పెరిగేందుకు ఏఐ ఉపయోగ పడుతుంది. విద్యార్థులకు సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యం, డిజిటల్‌ అవగాహన, విశ్లేషణాత్మక ఆలోచన వంటి నైపుణ్యాలు పెరుగుతాయి. పాఠ్యంశాలు, విద్యార్థుల ప్రగతిని, అదనపు అభ్యాసనకు ఏఐ సహాయపడుతోంది. పాఠశాలల్లో ఇంటర్నెట్‌, డిజిటల్‌ పరికరాలు, విద్యుత్‌ సదుపాయాలు కల్పిస్తే కార్యక్రమంతో విద్యారంగం అద్బుతంగా రాణిస్తుంది.

‘అన్న–అక్క మెంటర్‌షిప్‌’ కార్యక్రమం కింద జూలై 1 నుంచే తరగతులు ప్రారంభమయ్యాయి. డిగ్రీ ఫైనలియర్‌ విద్యార్థులు దగ్గరలో ఉండే స్కూళ్లకు వెళ్లి ఏఐ ద్వారా పాఠాలను బోధిస్తారు. ఏఐపై అవగాహన కల్పిస్తారు. దీంతోపాటు డిజిటల్‌ లిట్రసీ, కంప్యూటర్‌పై అవగాహన, కోడింగ్‌తోపాటు వివిధ అంశాలను బోధిస్తారు.

–బాలకృష్ణ, కోఆర్డినేటర్‌, నిజామాబాద్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement