క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Jul 4 2026 2:49 AM | Updated on Jul 4 2026 2:49 AM

చెరువులో పడి వృద్ధురాలు మృతి

మోపాల్‌: మండలంలోని సిర్‌పూర్‌ గ్రామంలో ఓ వృద్ధురాలు చెరువులో పడి మృతిచెందినట్లు ఎస్సై జాడె సుస్మిత తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన ఈర్ల నర్సవ్వ (76) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. మానసిక పరిస్థితి కూడా సరిగ్గా లేదు. ఈక్రమంలో ఈనెల 2న ఇంట్లో నుంచి ఆమె బయటికి వెళ్లి, తిరిగి రాలేదు. 3న ఉదయం మోపాల్‌ చెరువులో మృతదేహం కన్పించింది. స్థానికుల సమాచారం మేరకు చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు పంచనామ నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం జిల్లాకేంద్ర ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమార్తె గంగామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ సుస్మిత తెలిపారు.

నిచ్చెన నుంచి జారిపడి ఒకరు..

నవీపేట: మండల కేంద్రంలోని ధర్యాపూర్‌ కాలనీలో ఓ వ్యక్తి నిచ్చెన ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందాడు. ఎస్సై శ్రీకాంత్‌ తెలిపిన వివరాలు ఇలా.. రెంజల్‌ మండలంలోని నీలా గ్రామానికి చెందిన కూలి షేక్‌ అహ్మద్‌ పాషా(40) శుక్రవారం ధర్యాపూర్‌ కాలనీలోని ఓ పెంకుటిళ్లు పైకప్పును సరి చేసేందుకు వెళ్లాడు. నిచ్చెన సహాయంతో పైకి ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. తల వెనుక భాగంలో తీవ్ర గాయాలు కావడంతో ఆసత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి..

నవీపేట: మండలంలోని ఫకీరాబాద్‌– యంచ గ్రామాల మధ్య గుర్తుతెలియని రైలు నుంచి గుర్తుతెలియని వ్యక్తి(50) జారిపడి మృతిచెందినట్లు రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ మహబూబ్‌ శుక్రవారం తెలిపారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

చికిత్స పొందుతూ ఒకరు..

నవీపేట: మద్యంతోపాటు పురుగుల మందు తాగిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండలంలోని అభంగపట్నం గ్రామానికి చెందిన మంత గంగాధర్‌(36) అబ్బాపూర్‌(ఎం) శివారులోని ఎఫ్‌సీఐ గోదాములో వాచ్‌మెన్‌గా పని చేసేవాడు. కొంతకాలంగా అతడు మద్యానికి బానిసయ్యాడు. గురువారం అభంగపట్నం గ్రామ శివారులో మద్యంతోపాటు పురుగుల మందుతాగాడు. నొప్పి భరించలేక కేకలు వేయడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement