ఏకమై.. చెరవిడిపించారు | - | Sakshi
Sakshi News home page

ఏకమై.. చెరవిడిపించారు

Jul 4 2026 2:07 AM | Updated on Jul 4 2026 2:07 AM

మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌): సాగు భూమికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ, ఇరిగేషన్‌, తదితర విభాగాల పడావు భూమిని క్రమంగా సాగులోకి తీసుకు రావడం పరిపాటే. ఎవరికీ అభ్యంతరం లేనన్నాళ్లు పండించుకుంటారు. అధికారులు స్వాధీనం చేసు కుంటామనే సమయంలో రైతులు గగ్గోలు పెట్టడం, వివాదాలు సృష్టించడం, పోలీస్‌ బందోబస్తు, ఘర్షణలు.. తోపులాటలు.. అడ్డగింతలు.. కేసులు.. అరెస్టులు.. ఇలా అనేక సంఘటనలు చోటుచేసుకుంటాయి. కానీ మోపాల్‌ మండలం కులాస్‌పూర్‌లో గ్రామస్తులు ఇందుకు భిన్నంగా సాగు చేస్తున్న చెరువు భూమిని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అప్పగిస్తున్నారు. వివాదాలు, ఘర్షణలకు తావులేకుండా ఆదర్శంగా నిలుస్తున్నారు.

గ్రామస్తులంతా ఏకమై..

గ్రామంలో ఊర చెరువు, కుందెనపల్లి చెరువు, కొచ్చెరువు ఉన్నాయి. చెరువును ఆనుకొని ఉన్న రైతులు కొన్నేళ్లుగా చెరువు భూమిని సాగుచేసుకుంటున్నారు. కొంతకాలంగా గ్రామంలోని చెరువు భూముల సాగుపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గ్రామాభివృద్ధి, సర్పంచ్‌ ఆధ్వర్యంలో గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చారు. చెరువు భూ మి, గ్రామంలో భూగర్భజలాలు పరిరక్షణే ముఖ్యమనుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ ఆర్‌ భూపతిరెడ్డి, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఆర్డీవో రాజేంద్రకుమార్‌ దృష్టికి తీసుకెళ్లారు. వారి సహకారంతో సాగు చేస్తున్న రైతులను పిలిపించి ఒప్పించారు. రైతులు సైతం గ్రామ పంచాయతీ, వీడీసీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి భూమి అప్పగించేందుకు ముందుకొచ్చారు.

సరిహద్దుల్లో కందకాలు

గ్రామస్తులంతా ఏకతాటిపైకి రావడం, అధికారులు పచ్చజెండా ఊపడంతో ఇరిగేషన్‌, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో జాయింట్‌ సర్వే చేపట్టారు. మూడు చెరువుల్లో కలిపి సుమారు 70 ఎకరాలకుపైగా భూమిని స్వాధీనం చేసుకునే పనిలో గ్రామాభివృద్ధి కమిటీ, అధికార యంత్రాంగం నిమగ్నమైంది. సర్వే ప్రకారం చెరువు సరిహద్దులో కందకం తీస్తున్నారు. ఈ నిర్ణయంతో సర్పంచ్‌ గుడి జనార్దన్‌ రెడ్డి, ఉపసర్పంచ్‌ కోర్వ మహిపాల్‌, గ్రామాభివృద్ధి కమిటీ ప్రతినిధులు రాజారెడ్డి, కోర్వ సాయిలు, గ్రామపెద్దలు చెన్నూరు గంగారెడ్డి, దిలావర్‌ హుస్సేన్‌, ఆకుతోట సాయన్న, బూస మహిపాల్‌, గ్రామస్తులు సంతోషం వ్యక్తంచేశారు.

శుభపరిణామం

గ్రామాభివృద్ధి కమిటీ, సర్పంచ్‌ ఆధ్వర్యంలో చెరువు భూమిని స్వాధీనం చేసుకోవాలనే నిర్ణయించడం హర్షిస్తున్నాం. గ్రా మంలో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. చెరువుల్లో నీరు నిల్వ ఉండటం లేదు. నీటి కొరత ఏర్పడుతోంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని గ్రామమంతా ఏకమై తీసుకున్న నిర్ణయానికి రైతులుసైతం మద్దతు పలి కారు. ఇది శుభపరిణామం. – బూస మహిపాల్‌, రైతు

గ్రామస్తుల నిర్ణయానికి కట్టుబడి ఉన్నా

చెరువు భూమిలో కొన్నేళ్లుగా సాగు చేసుకున్నా ను. గ్రామస్తులంతా కలిసి ఆ భూమిలో సాగు చేయొద్దని, చెరువులో కలపా లని నిర్ణయించారు. వారి నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. స్వచ్ఛందంగా చెరువు భూమిని అప్పగిస్తున్నాను. ఎలాంటి అభ్యంతరం లేదు.

– గూండ్ల మేకల పెద్ద సాయిలు, రైతు

70 ఎకరాలకుపైగా భూమి

రైతుల నుంచి స్వాధీనం

స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన

అన్నదాతలు

మూడు చెరువుల్లో ఇరిగేషన్‌,

రెవెన్యూ జాయింట్‌ సర్వే

ఆదర్శంగా నిలిచిన కులాస్‌పూర్‌ గ్రామం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement