● సీఎం, టీపీసీసీ అధ్యక్షులపై
అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోం
● జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు
కాటిపల్లి నగేష్ రెడ్డి
నిజామాబాద్ రూరల్: కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని, అభివృద్ధిని చూసి బీజేపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ నాయకులకు ధైర్యం ఉంటే తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేసి చూపించాలన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెనుకేసుకు వస్తున్నారని అన్నారు. సీఎంను విమర్శించే స్థాయి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డికి లేదని మండిపడ్డారు. ఆర్మూర్ మున్సిపాలిటీని కై వసం చేసుకోలేని ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి , టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌ను రాజీనామా చేయాలని సవాల్ విసరడం విడ్డూరమన్నారు. మహేశ్‌కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ కై వసం చేసుకుందని గుర్తుచేశారు. జిల్లాకు మూడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇంజినీరింగ్ కాలేజీ, అగ్రికల్చర్ కళాశాల తీసుకువచ్చి జిల్లాను అభివృద్ధి బాటపట్టిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, టీపీసీసీ అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్, నుడా చైర్మన్ కేశ వేణు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


