పెర్కిట్(ఆర్మూర్): కేంద్ర ప్రభుత్వం మారు మూ గ్రామాల్లో ఉన్న పాఠశాలలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోందని, ఇందులో భాగంగానే నిధులను కేటాయిస్తున్నట్లు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. ఆలూర్ మండలం దేగాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 60 శాతం కేంద్ర ప్రభుత్వం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులు మొత్తం రూ.13 లక్షల 50 వేలతో ఏర్పాటు చేసిన సైన్సు ల్యాబ్‌ను గురువారం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో కలిసి ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ విద్యను ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. సర్పంచ్ ఇట్టెడి లింగారెడ్డి, ఎంపీడీవో గంగాధర్, ఎంఈవో నరేందర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
పెర్కిట్(ఆర్మూర్): పెర్కిట్‌లోని ఓ ప్రయివేట్ పాఠశాలకు డీఈవో అశోక్ కుమార్ గురువారం షో కాజ్ నోటీసులు జారీ చేశారు. సదరు పాఠశాలలో అనుమతి లేకుండా ఉర్దూ బోధన చేయించినందుకు నోటీసులు జారీ చేశారు. ఆర్మూర్ ఎంఈవో రాజ గంగారాం యాజమాన్యానికి నోటీసులను అందజేశారు.
మాక్లూర్: మండలంలోని దాస్‌నగర్ వద్దగల విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 6న పాలిటెక్నిక్‌లో స్పాట్ అడ్మిషన్లు ఇవ్వనున్నట్టు కళాశాల చైర్మన్ నరేంధర్‌రెడ్డి గురువారం తెలిపారు. కంప్యూటర్ సైన్స్ (సీఎస్‌ఈ), ఎలక్ట్రానిక్స్ (ఈసీఈ), ఎలక్ట్రికల్ (ఈఈఈ), సివిల్ కోర్సులు అందుబాటులో ఉన్నా యని వాటిని స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్టు తెలిపారు. అర్హత గల విద్యార్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో నేరుగా కళాశాలలో హాజరుకావాలన్నారు. మరిన్న వివరాలకు 99492 07789ను సంప్రదించాలన్నారు.
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయం యూజీసీ అఫైర్స్ డైరెక్టర్‌గా అర్థశాస్త్ర విభాగం అధ్యాపకుడు పాత నాగరాజు నియామకమయ్యారు. వీసీ యాదగిరిరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ యాదగిరి నియామక ఉత్తర్వులు జారీ చేయగా, గురువారం నాగరాజుకు వారు అందజేశారు. ఈసందర్భంగా నాగరాజుకు తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టూటా) అధ్యక్ష, కార్యదర్శులు పున్నయ్య, మోహన్ బాబు, సభ్యులు, పలువురు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.


