కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి

Jul 3 2026 9:32 AM | Updated on Jul 3 2026 9:32 AM

నేరాలు, రోడ్డు ప్రమాదాలను

నియంత్రించాలి

ఎస్పీ రాజేష్‌ చంద్ర

కామారెడ్డి క్రైం: పెండింగ్‌ కేసుల దర్యాప్తులో వేగం పెంచాలని ఎస్పీ రాజేష్‌ చంద్ర అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారి సమీక్షా సమావేశం గురువారం నిర్వహించారు. పోలీస్‌ స్టేషన్ల వారీగా కేసుల వివరాలు, విచారణ, పురోగతి, తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కోర్టులలో చార్జిషీట్లను సకాలంలో దాఖలు చేయడం ద్వారా నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలని సూచించారు. సీసీటీఎన్‌ఎస్‌ 2.0 అమలులో భాగంగా నమోదైన ప్రతి కేసుకు సంబంధించిన వివరాలను గడువులోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. అంతేకాకుండా వాటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలన్నారు. జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాలు, మట్కా, జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో బస్సులు, అనుమానాస్పద వాహనాలు, కీలక ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు. వర్షాకాలం నేపఽథ్యంలో భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు కలగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ .. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, ర్యాష్‌ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్‌ నేరాల బారిన పడకుండా ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ నరసింహారెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement