నిజామాబాద్‌ అభివృద్ధి వద్దా? | - | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌ అభివృద్ధి వద్దా?

Jul 3 2026 1:10 AM | Updated on Jul 3 2026 1:10 AM

మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఢిల్లీకి గులాంగిరి చేస్తున్నారు

తన పదవి పోతుందనే భయంతో రేవంత్‌ ఉన్నారు

మీడియాతో ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి

సుభాష్‌నగర్‌ : జిల్లా అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో ఒక్కసారైనా సమీక్ష నిర్వహించారా.. అని పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఆయన పైరవీకారుడని, పైరవీ చేసి పదవి కొనుక్కున్నాడని ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టులు, పరిశ్రమలు, రూ.వేల కోట్ల నిధులు కేవలం మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాలకే మళ్లిస్తున్నారన్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ పూడికతీత, కెనాల్‌ ఆధునీకరణ, జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్ట్‌ తదితర అనేక అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డిని తాను కలిశానని గుర్తుచేశారు. తెలంగాణ యూనివర్సిటీని ఏం అభివృద్ధి చేశారన్నారు. మహేశ్‌గౌడ్‌ ఢిల్లీకి గులాంగిరి చేస్తున్నారని, కొనుక్కున్న పదవిని జిల్లా అభివృద్ధి కోసం ఉపయోగించాలని హితవుపలికారు. తాను 3 నెలల్లో ఎమ్మెల్యేగా గెలిచానని, 30 ఏళ్లయినా మహేశ్‌గౌడ్‌ ఒక్కసారి కూడా గెలవలేవ లేదని విమర్శించారు. దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని, తాను కూడా రాజీనామా చేస్తానని, ఎన్నికల బరిలోకి దిగుదామని సవాల్‌ విసిరారు. వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని, సిద్దులగుట్ట అభివృద్ధికి రూ.30కోట్లు ఇవ్వాలని, ఆర్మూర్‌, బోధన్‌లో మున్సిపల్‌ భవనాలు లేవని పేర్కొన్నారు. నిజాంషుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించాలని, లక్కంపల్లి సెజ్‌లో కంపెనీలు ఏర్పాటుచేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. రెండుసార్లు ఓడిపోయిన ఈరవత్రి అనిల్‌ నోరు అదుపులో పెట్టుకోవాలని, బీసీల పేరుతో రాజకీయం చేయడం సరికాదన్నారు. ‘సీఎం పదవి మూడునాలుగు రోజుల్లో పోతుందనే భయం రేవంత్‌రెడ్డికి పట్టుకుందని, ఇటీవల కర్నాటకలో మార్చిన నేపథ్యంలో తెలంగాణలో కూడా మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతోందన్నారు. సమావేశంలో కిసాన్‌ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నూతుల శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, మాదాసు స్వామి యాదవ్‌, వేణుగోపాల్‌, శ్రీనివాస్‌రెడ్డి, ఆమంద్‌ విజయ్‌, మఠం పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement